Nuzvid Mango Crop: ఆంధ్రప్రదేశ్ కు ఖండాంతర ఖ్యాతి తెచ్చిపెట్టిన వాటిలో నూజివీడు మామిడి ప్రథమ స్థానంలో నిలుస్తోంది. నాణ్యమైన మామిడి దిగుబడులకు పెట్టింది పేరైన నూజివీడు ప్రాభవం మసకబారుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రంలోనే మామిడికి కృష్ణా జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. నూజివీడు పరిసర ప్రాంతాల్లో విస్తారంగా పండే మామిడిని దృష్టిలో ఉంచుకొని ఆసియాలోనే అతి పెద్ద మామిడి మార్కెట్ ను విజయవాడ చేరువలోనే ఉన్న నున్న గ్రామంలో నెలకొల్పారు.
వాతావరణ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న మామిడి దిగుబడులు, గడచిన రెండేళ్లుగా కరోనా వల్ల గణనీయంగా పడిపోయాయి. కరోనా మహమ్మారి శాంతించిన నేపథ్యంలో ఈ ఏడాది మామిడి దిగుబడులపై రైతులు ఆశలు పెంచుకున్నారు. అయితే వారి ఆశలను వమ్ము చేస్తూ ఈ ఏడాది కూడా మామిడి మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. బహిరంగ మార్కెట్లో మామిడి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. నూజివీడుతో పాటు మైలవరం, తిరువూరు, నందిగామ నియోజకవర్గాల్లోనూ మామిడి పంట విస్తారంగా పండిస్తున్నారు.
మామిడి సీజన్ ఆరంభం కావడంతో నున్న మాంగో మార్కెట్ లో సందడి మొదలైంది. అయితే గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నూజివీడు పరిసరాల్లో పుంజుకోవడంతో మామిడి తోటలో ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో మామిడి సాగు చేసే రైతులు తోటలను లే అవుట్‌లుగా మార్చేశారు. దీంతో సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం చూపించింది. రెండేళ్లుగా కోవిడ్‌తో అల్లాడిన మామిడి రైతులు ఈ ఏడాదైనా బాగుంటుందని ఆశించారు. అయితే వర్షాల ప్రభావంతో చాలా తోటల్లో పూత రాలిపోవడంతో ఆ ప్రభావం దిగుబడిపై పడింది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టినా దిగుబడి తగ్గడంతో పెట్టుబడి వ్యయం కూడా సమకూరడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. ఉన్న కొద్దిపాటి కాయలను మార్కెట్‌కు తీసుకువెళ్తే దళారులు సరైన ధర ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హరియాణా, ఢిల్లీ, గుజరాత్ కు చెందిన మామిడి వ్యాపారులు రైతులకు ముందస్తు అడ్వాన్సులు చెల్లించి తోట వద్దే మామిడిని కొనుగోలు చేస్తున్నారు. వారి బారిన పడకుండా నేరుగా నున్న మాంగో మార్కెట్ కు తెచ్చే రైతులకు గిట్టుబాటు ధర లభ్యం కాకుండా దళారులు అడ్డుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. మార్కెటింగ్ శాఖ అధికారుల వైఫల్యం కారణంగా ఆరుగాలం శ్రమించి మామిడి దిగుబడులు సాధించిన రైతులకు సైతం నిరాశే ఎదురవుతుంది. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధరలకు సరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది మామిడి దిగుమతి తగ్గిందని ఉన్న కాయలను వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామని విజయవాడ మ్యాంగో మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి వాసు తెలిపారు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో మామిడి ధరలు బెజవాడ ఎండలను మించి మండిపోతున్నాయి.