Yanamala Ramakrishnudu Comments on AP CM YS Jagan Mohan Reddys 3 Year Ruling : ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనపై మాట్లాడుతూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సెటైర్లు వేశారు. జగన్ 3 ఏళ్ల పాలన 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలుగా కొనసాగుతోందని యనమల ఎద్దేవా చేశారు. అధికారం కోసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నవరత్నాలు ఇస్తానని చెప్పిన వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చిన తరువాత నవమోసాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు.
నవరత్నాలు కాదు నవమోసాలు..
ఏపీ ప్రజలకు నవరత్నాలు తీసుకొచ్చానని సీఎం జగన్ డబ్బా కొడుతున్నారని, ప్రజల పాలిట అవి నవమోసాలని యనమల రామకృష్ణుడు (Yanamala About Navaratnalu) పేర్కొన్నారు. నవరత్నాలు ఇస్తానని చెప్పి, నవమోసాలకు పాల్పడిన సీఎం జగన్‌కు ఎప్పుడెప్పుడు బుద్ధి చెప్పాలా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగన్ మూడేళ్ల పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే.. 9 మోసాలు, 18 కుంభకోణాలు, 36 దోపిడీలుగా పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. గెలవకపోతే నవరత్నాలను నిలిపివేస్తానని అధికార పార్టీ చెప్పడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి రాబోయే రోజులు గడ్డు కాలమేనని యనమల తెలిపారు.
రాష్ట్రంలో ఎటు చూసినా సమస్యలే..
సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన ఘనత సీఎం జగన్ (AP CM YS Jagan Mohan Reddy) సొంతమని వ్యాఖ్యానించారు. కరెంట్ కోతలతో పలు రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, తద్వారా పలు వర్గాలకు ఇది తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందన్నారు. విచ్చలవిడిగా అప్పులు చేయడంతో రాష్ట్ర ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రజలను పని చేయకుండా సోమరులను చేస్తూ వారి భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్న నేత ఏపీ సీఎం అని చెప్పారు. సంక్షేమ పథకాలలోనూ అవినీతికి పాల్పడిన ప్రభుత్వం వైఎస్సార్ సీపీ సర్కార్ అని చురకలు అంటించారు యనమల.