OU Rahul Gandhi Meeting : హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 7న రాహుల్ గాంధీ విద్యార్థులతో సమావేశం నిర్వహించేందుకు కాంగ్రెస్ ఓయూ వీసీని అనుమతి కోరింది. అందుకు ఓయూ పాలక వర్గం అనుమతి నిరాకరించింది. వర్సిటీలో ఎలాంటి బహిరంగ సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శనివారం ఓయూలో విద్యార్థి సంఘాల నేతలు నిరసన తెలిపారు. ఇలా నిరసన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం కూడా ఓయూలో ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ కోణంలో రాహుల్ సభకు అనుమతి నిరాకరించారని ఆరోపిస్తూ ఓయూ అడ్మినిస్ట్రేటివ్ భవనం వద్ద ఎన్.ఎస్.యు.ఐ నేతలు ఆందోళన చేశారు. అడ్మినిస్ట్రేటివ్ భవనం అద్దాలు ధ్వంసం చేశారు. వీసీ తీరుకు నిరసనగా గాజులు, చీరలు పంచిపెట్టారు. 


మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి 


ఏఐసీసీ నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ మే 6,7వ తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే రాహుల్ సభతో పాటు ఎలాంటి సభలను ఓయూలో నిర్వహించడానికి అనుమతి ఇవ్వలేమని ఓయూ వీసీ, ఓయూ కమిటీ నిర్ణయం స్పష్టం చేసింది. దాంతో ఆదివారం ఓయూ విద్యార్థులు మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. కొందరు ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ఆయన ఓయూకి వెళ్తారన్న సమాచారంతో నిర్బంధించామని పోలీసులు తెలిపారు. న్యాయపరంగా సభకు అనుమతి పొందుతామని జగ్గారెడ్డి అంటున్నారు. 


రాహుల్ గాంధీ వస్తే ఎందుకంత భయం : రేవంత్ రెడ్డి 


రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే సీఎం కేసీఆర్‌కు ఎందుకు భయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ సభను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. రాహుల్‌గాంధీ ఓయూ సమావేశానికి అనుమతి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, వీహెచ్‌ ఓయూ వీసీ అనుమతి కోరారని, కానీ పర్మిషన్ ఇవ్వలేదన్నారు. రాహుల్‌గాంధీపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు తాను స్పందించన్నాుర. రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. ఓయూ పర్యటనకు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ నాయకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.