Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయనున్నారు. నిన్న (మే 1) హైదరాబాద్‌లో కాంగ్రెస్ విద్యార్థి నాయకుల (NSUI) అరెస్టులకు నిరసనగా సోమవారం కేసీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటనను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతల్ని నిలువరించేందుకు టీఆర్ఎస్ అన్ని చర్యలు చేపడుతోందని, అందుకే నిన్న ఎన్ఎస్‌యూఐ నేతలను అరెస్టు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.


రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించేందుకు పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఎన్ఎస్‌యూఐ నేతలు నిన్న నిరసన చేశారు. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తో పాటు 18 మంది యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారిని అరెస్టు చేశారని వారు ఆరోపించారు. ఆదివారం బల్మూరి వెంకట్ తో సహా మొత్తం 18 మంది నాయకులను 14 రోజుల రిమాండ్ పై చంచల్ గూడ జైలుకు తరలిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


దీన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వారి అరెస్టులకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.