ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన కోసం కోర్టును అనుమతి కోరారు. యూకే పర్యటనకు వెళ్లడం కోసం తెలంగాణ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్ళరాదని బెయిల్ షరతులు ఉండడంతో వాటిని సడలించాలని జగన్ పిటిషన్‌లో కోరారు. అయితే, జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు కోసం సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్ పై విచారణ ఈనెల 30కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. లండన్ లో ఉంటున్న తన కుమార్తె వద్దకు సెప్టెంబర్ 2న వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు.


ఎంపీ విజయసాయి కూడా


మరోవైపు, విదేశీ పర్యటన కోసం ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ షరతులు సడలించాలని కోరుతూ ఎంపీ విజయసాయి రెడ్డి పిటిషన్ వేశారు. యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్ సింగపూర్ పర్యటనకు విజయసాయి రెడ్డి అనుమతి కోరారు. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్లనున్నట్లుగా పిటిషన్ లో విజయసాయి రెడ్డి వెల్లడించారు. అయితే, విజయసాయి రెడ్డి పిటిషన్ పైన కూడా కౌంటరు దాఖలు చేయడం కోసం సీబీఐ సమయం కోరింది. దీంతో విజయసాయి రెడ్డి పిటిషన్‌ను కూడా ఈ నెల 30కి వాయిదా వేసింది.