ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించారు. ప్రధాని మోదీతో సీఎం గంట పాటు సమావేశమయ్యారు. సీఎం జగన్ తో ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు, పెండింగ్ సమస్యలను సీఎం జగన్ ప్రధానికి నివేదించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక పరిస్థితికి తీవ్రంగా ఉందని, విభజన సమయంలో 58 శాతం జనాభాకు, 45 శాతం రెవెన్యూ మాత్రమే దక్కిందని ప్రధానికి తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఈ గణాంకాలే నిదర్శనమని ప్రధానితో సీఎం జగన్ తెలిపారు.
సర్వం కోల్పోయాం
రాష్ట్ర విభజనతో రాజధానిని కూడా ఏపీ కోల్పోయిందని సీఎం ప్రధానితో అన్నారు. తెలంగాణలో నిర్మించుకున్న మౌలిక సదుపాయాలను ఏపీ కోల్పోయిందన్నారు. ప్రత్యేక హోదా పాటు విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరారు. 2013 భూసేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు భారీగా పెరిగిందని తెలిపారు. ఏప్రిల్ 1, 2014 అంచనాల మేరకు పోలవరం నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ అంటుందని, 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్ట్ వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదని ప్రధానికి సీఎం జగన్ నివేదించారు. అంతకు ముందు దిల్లీ ఎయిర్ పోర్టులో సీఎం జగన్‌కు వైసీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ ఇవాళ సాయంత్రం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశంకానున్నారు. మంగళవారం ఉదయం గం.9.30లకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అవ్వనున్నారు.
నిర్మలా సీతారామన్ తో భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్ సమస్యలను కేంద్ర మంత్రికి నివేదించారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించారు. ప్రత్యేక హోదా, పోలవరం అంచనాలు, రెవిన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, రుణపరిమితి, రాష్ట్రానికి ఆర్థిక సహాయం తదితర అంశాలను ఆర్థిక మంత్రితో సీఎం జగన్ చర్చించారు.
ప్రధానికి ఇచ్చిన వినతి పత్రంలో సీఎం జగన్ నివేదించిన అంశాలు
2013 నాటి భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది. ఏప్రిల్ 1, 2014 అంచనాల మేరకే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో తెలిపింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు. అంతే కాకుండా అప్పటివరకూ ఇరిగేషన్ కాంపొనెంట్ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీని వల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారమంతా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 90కు ఇది విరుద్ధం. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై ఏళ్లు గడుస్తుంది. వ్యయం కూడా పెరుగుతుంది. ప్రాజెక్టు ఖర్చులో అధిక భాగం 2013 నాటి భూసేకరణ చట్టం అమలుకే ఖర్చు చేశాం. చట్టం ప్రకారం ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సిన కుటుంబాలకు ప్యాకేజీలను కూడా విస్తరించాల్సి ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర భారం. భూ సేకరణ, ఆర్‌అండ్‌ఆర్ రూపేణా సవరించిన అంచనాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు తిరస్కరించడం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టులో కేవలం ఇరిగేషన్ భాగానికి మాత్రమే నిధులు ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఏ నీటి ప్రాజెక్టులోనైనా రెండు రకాల భాగాలు ఉంటాయి. ఒకటి ఇరిగేషన్ కాగా, రెండోది విద్యుత్ ఉత్పత్తి. తాగునీరు అనేది ఇరిగేషన్‌లోనే ఒక అంతర్భాగం. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలోనైనా ఇప్పటి వరకూ దీన్నే పాటిస్తున్నారు. ఈ విషయలలో ప్రధాని జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు ఇవ్వాలి. ప్రాజెక్టు పూర్తి ఆలస్యం అయితే ఖర్చు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. 2017–18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా నిర్ణయించాలి. అంతే కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన రూ.2100 కోట్ల పెండింగ్ బిల్లులను మంజూరు చేసేలా ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాము.
పెండింగ్ నిధులు చెల్లించాలి
విభజన సమయంలో ఏపీ రెవిన్యూ లోటును పూడుస్తామంటూ అప్పటి ప్రధానమంత్రి ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన జరిగే తేదీ నాటికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు తేదీకి మధ్యనున్న రిసోర్స్ గ్యాప్‌ను 2014–15 కేంద్ర బడ్జెట్ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. 2014 జూన్ నుంచి మార్చి 31, 2015 వరకూ ఉన్న రీసోర్స్ గ్యాప్ మొత్తం రూ.16,078.76 కోట్లు అని కాగ్ నిర్ధారించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతిని తీసుకువచ్చింది. రీసోర్స్ గ్యాప్‌ను కేవలం రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. దీంతో నిధుల కొరత వల్ల 2014–15 ఆర్థిక సంవత్సరంలో చాలా బిల్లులను, పీఆర్సీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేకపోయింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులను, ఇతర బకాయిలను పరిగణలోకి తీసుకుంటే రెవిన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది కేవలం రూ.4,117.89 కోట్లు మాత్రమే. చాలా కాలంగా పెండింగులో ఉన్న మిగిలిన రూ.18,830.87 కోట్లు చెల్లించి రాష్ట్రానికి అండగా నిలవాలని కోరుతున్నాం.
Also Read: సినిమా టిక్కెట్లపై అఫిడవిట్‌కు సమయం కావాలన్న ప్రభుత్వం..., ఫిబ్రవరికి వాయిదా వేసిన హైకోర్టు !
తెలంగాణ విద్యుత్ బకాయిలు చెల్లించాలి
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్‌ను సరఫరా చేసింది. జూన్ 2, 2014 నుంచి జూన్ 10, 2017 వరకు విద్యుత్‌ను అందించింది. కేంద్ర ప్రభుత్వ నిర్దిష్ట ఆదేశాల మేరకు ఆ విద్యుత్ పంపిణీ జరిగింది. దీని కోసం రూ.6,284 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు కూడా గుర్తించాయి. కాని ఇప్పటివరూ ఎలాంటి చెల్లింపులు చేయలేదు. ఆ బకాయిలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం.
ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం
ఏపీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. 2019–20 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రగతి మందగించింది. దీని వల్ల కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల ఆదాయం తగ్గుతూ వస్తోంది. ఆ ఆదాయం దాదాపు 3.38 శాతం తగ్గింది. గత 2 దశాబ్దాల్లో కేంద్రం నుంచి వచ్చే పన్నుల ఆదాయంలో అతి తక్కువ నమోదైంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ వల్ల పరిస్థితి మరింత దిగజారింది. ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు విపరీతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రానికి ఆర్థికసాయం అందించాలని కోరుతున్నాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్‌ను రెన్యువల్ చేయాలని కోరుతున్నాం. వైయస్సార్ కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి మెకాన్ సంస్థకు వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చూడాలని కోరుతున్నాను.
Also Read: శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన సీడబ్ల్యూసీ డ్యామ్ సేఫ్టీ కమిటీ సభ్యులు