CM Chandrababu Restarted Capital Works: అమరావతి (Amaravathi).. ఒక రాష్ట్రం ఒక రాజధాని అని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ఆయన శనివారం ప్రారంభించారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సీఆర్డీఏ ఆఫీసు పనుల ప్రారంభంతో రాజధాని పునఃనిర్మాణానికి ముందడుగు పడింది. భవన ప్రాంగణంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి నారాయణ పూజా కార్యక్రమం నిర్వహించారు. కాగా, టీడీపీ హయాంలో రూ.160 కోట్లతో ఏడంతస్తుల్లో సీఆర్డీఏ కార్యాలయ పనులు చేపట్టారు. ప్రాజెక్ట్ కార్యాలయ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. అయితే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో రాజధాని అమరావతి నిర్మాణానికి బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ రాజధాని నిర్మాణం ఊపందుకుంది. మొత్తం 3.62 ఎకరాల్లో జీ ప్లస్ 7 భవనాన్ని ఇక్కడ సర్కారు నిర్మిస్తోంది. అదనంగా పార్కింగ్, ల్యాండ్ స్కేపింగ్‌కు 2.51 ఎకరాల విస్తీర్ణం కేటాయించారు. ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్స్, ఇంటీరియర్స్, ఎలక్ట్రిక్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.










ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 'విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం. రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం.. అమరావతి. ఒక రాష్ట్రం.. ఒక రాజధాని అని ప్రతిచోటా చెప్పాను. కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర విభజన సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం. ఉమ్మడి ఏపీలో సైబరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత మాదే. ముందుచూపుతో ఆనాడే సైబరాబాద్‌లో 8 వరుసల రోడ్లు వేశాం. శంషాబాద్ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు ఎందుకని అందరూ ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుపడే వారు ప్రతిచోటా ఉంటారు. అమరావతి రైతులను ఒప్పించి భూమి సేకరించాం. రాజధాని, సమాజ హితం కోసం మీరంతా భూములు ఇచ్చారు. అమరావతి కోసం 54 వేల ఎకరాలు సేకరించాం. మహిళా రైతులు వైసీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాడారు. అమరావతికి విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వర్శిటీలు వస్తున్నాయి. దేశంలోని టాప్ 10 విద్యా సంస్థల బ్రాంచ్‌లు ఇక్కడికి రావాలి. బుల్లెట్ రైలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాను. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, అమరావతి మీదుగా బుల్లెట్ రైలు కావాలి. అమరావతి నిర్మాణ పనులు జెట్ స్పీడ్‌తో జరగాలి.' అని చంద్రబాబు పేర్కొన్నారు.


Also Read: Unstoppable Season 4 - AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా బాలయ్య పండగ మొదలు... రేపే 'అన్‌స్టాపబుల్ 4' ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్