Chandrababu Meeting On Rains In AP: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. శనివారం ఉదయం అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు (CM Chandrababu).. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వానలపై ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూ.. అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మ్యాన్ హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్నారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని.. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు. 


నీట మునిగిన విజయవాడ


అటు, శుక్రవారం రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాలతో విజయవాడ నగరం నీట మునిగింది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయ్యాయి. గత 12 గంటల్లో ఎన్నడూ లేని విధంగా దాదాపు 16 సెం.మీల భారీ వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. ఏకధాటిగా కురుస్తోన్న వర్షంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల పట్ల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులను అలర్ట్ చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో ఫోన్‌లో మాట్లాడారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా.. డ్రైనేజీల్లో నీటి పారుదలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.


ఈ జిల్లాల్లో వర్షాలు


అటు, విశాఖ, ప్రకాశం, విజయవాడ, మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు కలెక్టర్ హరీంధర్ ప్రసాద్ సెలవులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలోని స్కూళ్లకు సైతం అధికారులు సెలవు ఇచ్చారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలను కలెక్టర్ అప్రమత్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం - కేశ్యాతండా మధ్య వాగులో వరద ఉద్ధృతితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం జిల్లా మార్కాపురం, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 3,32,374 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 


ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల - వినగడప మధ్య కట్టలేరు వాగు తెగి 20 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నందిగామ మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆడిరావులపాడు గ్రామం వద్ద నల్లవాగు పొంగి రామన్నపేట - నందిగామ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అటు, దాములూరు - వీరులపాడు మధ్య రాకపోకలను అధికారులు నిలిపేశారు. మచిలీపట్నంలోనూ భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


అల్పపీడన ప్రభావంతో


వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని.. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లోని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 45 - 65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని.. ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చెయ్యొద్దని పేర్కొన్నారు. శనివారం అర్ధరాత్రి విశాఖ - గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.


Also Read: Vijayawada: భారీ వర్షానికి విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు- ఒకరు మృతి, పలువురికి గాయాలు