AP CM Chandrababu meets PM Modi | న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం నాడు బిజీబిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహాలు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. మొదట కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో చంద్రబాబు సమావేశమై, రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటుపై సమీక్షించారు.
రాష్ట్రానికి నిధులపై కేంద్రం పెద్దలతో వరుస భేటీలు
అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని, రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం నుంచి నిధుల రావాల్సిన నిధుల అవసరాన్ని ప్రస్తావించారు. అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షాతో గంటన్నరపాటు సమావేశం కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం చర్చల్లో పాల్గొన్నారు. అమిత్ షా, నడ్డాతో భేటీలో ఏపీ రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జరిగిన చంద్రబాబు భేటీలో ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించినట్లు సమాచారం.
ప్రధాని మోదీతో భేటీలో భాగంగా.. ఏపీ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం, ఏపీ విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి త్వరగా నిధులు అందేలా చూడాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి వివరించిన చంద్రబాబు
గత ఐదేళ్లలో ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఘోరంగా మారిందని కేంద్రం పెద్దలకు చంద్రబాబు వివరించారు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలన్నా, అభివృద్ధి పనులు కొనసాగాలన్నా నిధుల రూపంలో ఏపీకి కేంద్ర సాయం అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది. బీజేపీకి సొంతంగా పూర్తి మెజార్టీ లేకపోవడంతో ఎన్డీయేలో బిహార్ నితీష్ కుమార్ కు పార్టీ జేడీయూ, ఏపీకి చెందిన టీడీపీ మద్దతు కీలకమని తెలిసిందే. దాంతో ఏపీ, బిహార్ నేతల డిమాంట్లపై ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ లో ఈ రెండు రాష్ట్రాలకు ఆర్థిక సాయం విషయాల్ని గుర్తించి నిధులు కేటాయించారు. సాధ్యమైనంత త్వరగా నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.