X ordered to pay 5 crore to employee fired for not replying to Elon Musk email :  ట్విట్టర్‌ను చాలెంజ్  చేసి మరీ కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ తర్వాత అందులో పని చేసే ఉద్యోగులతో ఓ ఆట ఆడుకున్నారు. ఆ ఆటతో ఆయన చాలా సంతోషపడ్డారు. కానీ చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాను వచ్చిన తర్వాత  ఉద్యోగులందరికీ రూల్స్ మార్చేశారు. పని గంటలు ఎక్కువ సేపు పని చేయాలని.. టార్గెట్లు రీచ్  కావాలని ఇలా అనేక రూల్స్ పెట్టారు. తన కొత్త రూల్స్ తో అందరికీ ఓ ఈ మెయిల్ పంపారు. అంగీకరించాల్సిందేనని లేకపోతే ఉద్యోగం నుంచి రాజీనామా చేసినట్లుగా భావిస్తామని ఆ ఈ మెయిల్‌లో యాక్సెప్ట్  బటన్ కూడా యాడ్ చేశారు. 


కానీ ఐర్లాండ్ కు చెందిన రూనీ అనే ఉద్యోగి.. ఎలాన్ మస్క్ మెయిల్ చదివారు కానీ.. యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఆయనను కంపెనీ నుంచి తొలగిస్తున్నట్లుగా లేఖ వచ్చింది. టెర్మినేట్ చేసి.. ఆయనకు రావాల్సినవి ఇచ్చేసి ట్విట్టర్ నుంచి సాగనంపారు. అయితే ఈ రూనీ కూడా నిన్నామొన్న ట్విట్టర్ ను కొనేసిన  మస్క్ కే అంత ఉంటే చాలా కాలంగా పని  చేస్తున్న తనకు ఎంత ఉండాలని అనుకున్నారు. అందుకే తనను టెర్మినేట్ చేసిన విధానం కరెక్ట్ కాదని దాని వల్ల తాను ఎంతో మానసిక వేదనకు గురయ్యానని కోర్టులో కేసు ఫైల్ చేశారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం.. మస్క్ కు చెందిన ఎక్స్ వాదనను కొట్టి వేసి రూనీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 


రూనీకి తక్షణం ఐదున్నర లక్షల పౌండ్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఐదు కోట్ల రూపాయలు. ఐర్లాండ్‌లో వర్క్ ప్లేస్ రిలేషన్స్ కమిషన్ ఉంటుంది. ఇందులో ఇలా ఉద్యోగుల్ని అనుచిత పద్దతుల్లో తొలగించడం అన్యాయం చేయడం వంటివి చేస్తే.. న్యాయం చేస్తారు.  ఎలాన్ మస్క్.. పట్టుదలకు పోయి ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. 2022లో నలభై నాలుగు బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత అంత మొత్తం పెట్టుబడిపై వడ్డీ, ఆదాయం సంపాదించుకోడవానికి ఉద్యోగుల్ని  తొలగించడం... చార్జీల్ని విధించడం వంటివి  ప్రారంభించారు.                                                                     


ట్విట్టర్‌కు అనేక దేశాల్లో కార్యాలయాలు ఉండేవి. కానీ  ఎలాన్ మస్క్ టేకోవర్ చేసిన తర్వాత  చాలా దేశాల్లో మూసేశారు. పరిమితమైన మ్యాన్ పవర్ తో ప్రస్తుతం ట్విట్టర్ ను నడుపుతున్నారు. మధ్యలో అనేక రకమైన సాంకేతిక సమస్యలు వస్తున్నాయన్న విమర్శలు ఉన్నా.. ఆయన  ప్రస్తుత పద్దతినే ఫాలో అవుతున్నారు.  ప్రస్తుతం అమెరికా రాజకీయాలపై దృష్టి పెట్టి.. ట్విట్టర్‌లో ట్రంప్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.