CM Chandrababu Review On Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిని (Amaravati) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI - ఏఐ) సిటీగా తీర్చిదిద్దాలని.. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిపై పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులతో ఆయన గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గుర్తుకు వచ్చేలా   అమరావతి లోగో ఉండాలని.. రాజధాని పేరులో ఆంగ్లంలో మొదటి అక్షరం A, చివరి అక్షరం I కలిసేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలని సూచించారు.


90 రోజుల్లో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని నిర్దేశించారు. రాజధాని ప్రాంతంలో త్వరితగతిన జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలని అన్నారు. రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడాలన్నారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించాలని సూచించారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి పట్టే సమయం, పనులు చేపట్టేందుకు టెండర్లు పిలవడం వంటి అంశాలపైనా సమావేశంలో ఆయన సమీక్షించారు. 'అమరావతి దేవతల రాజధాని. అలాంటి గొప్ప రాజధాని పట్ల గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. ఇప్పుడు రాజధాని పనులు వేగవంతం కావాలి. పనుల విషయంలో ఎక్కడా రాజీ వద్దు.' అని సీఎం అధికారులకు సూచించారు.


హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుపైనా..


అటు, హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుపైనా సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలని కోరుకునే వారి కోసం 14 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును రూపొందించామని.. అయితే, 2019లో వైసీపీ హయాంలో దీనికి గ్రహణం పట్టిందన్నారు. ఈ ప్లాట్లన్నీ అప్పట్లో ఒక్క గంటలోనే అమ్ముడుపోయాయని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఈ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వ చర్యలతో కొనుగోలుదారులు వెనక్కి వెళ్లిపోయారని అన్నారు. గత ప్రభుత్వ చర్యల కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనుల కోసం 190 ప్రొక్లెయిన్లు వినియోగిస్తున్నామని.. 60 శాతం పనులు పూర్తైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 


మరోవైపు, విశాఖ, విజయవాడల్లో మెట్రో రైలు ప్రాజెక్టు పనులను సైతం త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును రెండు ఫేజుల్లో చేపడతామని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సీఎంకు వివరించారు. అటు, విజయవాడలోనూ రూ.11 వేల కోట్లతో 38 కి.మీ మేర చేపట్టబోయే మెట్రో రైలు నిర్మాణ ప్రాజెక్ట్ పనులను సైతం వేగవంతం చేయాలని సీఎం నిర్దేశించారు.


అమరావతి రైతులకు గుడ్ న్యూస్


సెప్టెంబర్ 15లోగా అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లిస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిపై సీఎం సమీక్ష అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. అమరావతిలో ఇంకా 3,550 ఎకరాలు సేకరించాల్సి ఉందని అన్నారు. 'హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు సీఎం క్లియరెన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.900 కోట్లు కావాలి. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టుల పూర్తికి సీఎం ఆదేశాలిచ్చారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గాలంటే మెట్రోల వల్లే సాధ్యం.' అని మంత్రి పేర్కొన్నారు.


Also Read: Monkeypox RT-PCR Kit : దేశంలోనే తొలి మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ రెడీ - విశాఖ మెడ్‌టెక్ జోన్ ఘనత - ఆవిష్కరించిన చంద్రబాబు