First indigenous Monkeypox RT-PCR Kit Released by Chandrababu : కరోనా వైరస్ తర్వాత ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది మంకీపాక్స్ వైరస్. ఈ వైరస్ వ్యాక్సిన్ కనుగొన్నారు కానీ టెస్టులకు మాత్రం ఇంకా నమ్మకమైన టెస్టింగ్ కిట్ ఏదీ రాలేదు. మన దేశంలో ఇప్పటి వరకూ అలాంటి టెస్టింగ్ కిట్ లేదు. మొదటి సారిగా విశాఖలోని మెడ్ టెక్ జోన్ లో మంకీపాక్స్ వైరస్ సోకిందో లేదో తెలుసుకునేందుకు ఆర్టీపీసీఆర్ కిట్ తయారు చేశారు. ఈ కిట్ కు.. జాతీయ స్థాయిలో అన్ని రకాల వైద్య సంబంధిత వర్గాల నుంచి అనుమతులు వచ్చాయి. ఈ కిట్ ను ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో ఆవిష్కరించారు.
విశాఖ మెడ్ టెక్ జోన్ లో కిట్ తయారీ అభినందనీయమని చంద్రబాబు అన్నారు. మొట్టమొదటి దేశీయ మంక్సీపాక్స్ టెస్ట్ కిట్ విడుదల గర్వకారణమని.. మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేసిన మెడ్ టెక్ జోన్ నిపుణులు చంద్రబాబుతో ఆవిష్కరింపచేశారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరణ కార్యకమంలో చంద్రబాబు పాల్గొన్నారు. విశాఖ మెడ్ టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, జోన్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రికి కిట్ పనితీరును వివరించారు.
ఈ కిట్ ను తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెడ్ టెక్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. మెడ్ టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్‌డెక్స్ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్ ... ErbaMDx MonkeyPox RT-PCR Kit పేరిట ఈ కిట్ రూపకల్పన చేసింది. ఈ కిట్ తయారీకి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ అర్గనైజేషన్ నుంచి అత్యవసర అనుమతి కూడా లభించింది. మంకీపాక్స్ నిర్ధారణకు దేశీయంగా మొదటి ఆర్టీపీసీఆర్ కిట్ ను రూపొందించిన మెడ్ టెక్ జోన్ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుందని.. ప్రభుత్వం నుండి మెడ్ టెక్ జోన్ కు అన్ని విధాలా సహాయ,సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.
మరిన్ని మెడికల్ అద్భుతాలకు మెడ్ టెక్ జోన్ ఆవిష్కరణకు సిద్ధమయిందని ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. వినియోగదారులకు ఆర్థిక భారం లేకుండా త్వరలో సోలార్ తో నడిచే ఎలక్ట్రానికి వీల్ చైర్ ను రూపొందిస్తున్నామని దాన్ని త్వరలోనే మార్కెట్‌లోకి తేబోతున్నామని తెలిపారు. తక్కువ ఖర్చుతో మన్నిక గల వైద్య పరికరాలను తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వైజాగ్ మెడ్ టెక్ జోన్ కరోనా సమయంలో ఆర్టీపీసీఆర్ కిట్లను ఉత్పత్తి చేసి.. ఎంతో ఉపయోగపడింది. వైద్య రంగంలో భారీగాపరిశోధనలు చేసి.. తక్కువ ఖర్చుతో వైద్య పరికరాలు రూపొందించడానికి నిరంతరం కృషి చేస్తోంది.