JIO AI Free Cloud Storage: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ జియో యూజర్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. 47వ వార్షికోత్సవం సందర్భంగా Jio AI-Cloud Welcome Offer ప్రకటించారు. జియో వినియోగదారులకు ఇకపై AI సేవల్ని మరింత చేరువ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా జియో వినియోగదారులందరికీ ఉచితంగా 100GB క్లౌడ్ స్టోరేజ్ ఇస్తామని తెలిపారు. ఫోన్‌లోని డేటాని ఈ స్టోరేజ్‌లో చాలా సేఫ్‌గా స్టోర్ చేసుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ని అందులో భద్రపరుచుకునేందుకు వీలుంటుంది. జియో యూజర్స్‌కి డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇంకాస్త ఎక్కువగా అందించేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్టు ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఈ ఏడాది దీపావళి నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. 


"ఈ మధ్య కాలంలో AI టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. ఈ టెక్నాలజీ అందరికీ చేరువ కావాలన్నదే మా ఆకాంక్ష. అందుకే జియో AI క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ని ప్రకటిస్తున్నాం. అందరికీ క్లౌడ్ స్టోరేజ్‌ని అందుబాటులోకి తీసుకు రావాలని భావించాం. ఈ ఆఫర్‌లో భాగంగా జియో వినియోగదారులకు 100GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ వస్తుంది. వాళ్ల ఫోన్‌లలోని ముఖ్యమైన ఫొటోలు, వీడియోలతో పాటు ఇతరత్రా డేటా అంతా అందులో భద్రపరుచుకోవచ్చు"


- ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ 






ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇందుకోసం జియో ప్రత్యేకంగా టూల్స్‌ని, ప్లాట్‌ఫామ్స్‌ని రూపొందిస్తున్నట్టు వివరించారు. దీనికి Jio Brain అనే పేరు కూడా పెట్టినట్టు తెలిపారు. జియోలో AI సర్వీస్‌లను వినియోగించుకునేందుకు ఈ జియో బ్రెయిన్‌ ఉపయోగపడుతుందని అన్నారు. జియోలోనే కాకుండా రిలయన్స్ పరిధిలోని అన్ని సంస్థల్లోనూ దీన్ని వినియోగించాలని భావిస్తున్నట్టు చెప్పారు ముకేశ్ అంబానీ. అందుబాటు ధరలోనే AI సేవలను అందరికీ చేరువ చేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 


ఈ సందర్భంగా ఆకాశ్ అంబానీ కూడా కొన్ని కీలక ఆఫర్‌లు ప్రకటించారు. JIO Phone Call AI అనే ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే ఫోన్ కాల్స్ ఆటోమెటిక్‌గా రికార్డ్ అవుతాయి. అన్నీ స్టోరేజ్‌లో స్టోర్ అవుతాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...ఈ కన్వర్జేషన్‌ని పూర్తిగా టెక్స్ట్ ఫార్మాట్‌లోకి మార్చి చూపిస్తుంది. ఇదే సమయంలో Jio TV Plus నీ లాంఛ్ చేశారు. ఇందులో లైవ్‌ టీవీతో పాటు యాప్స్, రకరకాల షోస్‌ అందుబాటులో ఉంటాయి. 860 లైవ్ టీవీ ఛానెల్స్‌తో సహా అమెజనా ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్‌స్టార్ యాప్స్‌నీ యాక్సెస్ చేయొచ్చు. 


Also Read: Gautam Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ - మళ్లీ టాప్ ప్లేస్‌లోకి - ఇదిగో హురూన్ లిస్ట్