Free Gas Scheme Implemented From Diwali In AP: మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం (Free Gas Cylinder Scheme) అమలుపై కీలక ప్రకటన చేసింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. పండుగ రోజున ఫ్రీగా మొదటి సిలిండర్ అందిస్తామని అన్నారు. ఈ విషయాన్ని మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో వెల్లడించారు. కాగా, ఎన్నికల హామీల్లో భాగంగా మహాశక్తి పథకం కింద పేదలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు.. ప్రతి ఇంటికీ 3 గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది.
ఎమ్మెల్యేలు, ఎంపీలకు కీలక సూచనలు
అలాగే, నియోజకవర్గాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు విజన్ డాక్యుమెంట్లు రూపొందించుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పు, రూ.లక్ష కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని.. గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. కేంద్ర నిధులు పక్కదారి పట్టాయని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో డబ్బులు లేవని.. కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అయినా ధైర్యంతో ముందుకెళ్తున్నామని అన్నారు. 3 పార్టీల సమిష్టి కృషితోనే ఇంతటి ఘన విజయం సాధించామని పునరుద్ఘాటించారు. కేంద్ర సహకారం లేకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందదని.. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా పని చేస్తున్నామని చెప్పారు. 151 సీట్లు ఉన్నాయని గర్వంతో విర్రవీగిన వారు ఇప్పుడు 11 సీట్లకే పరిమితమయ్యారని.. ఇదే ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు.
'తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష అనుభవించక తప్పదు. జగన్ అన్నా క్యాంటీన్ రద్దు చేసి దుర్మార్గంగా వ్యవహరించారు. వైసీపీ హయాంలో తప్పులు చేసిన వారిని వదిలిపెట్టను. అదే సమయంలో మనం తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ప్రజలు మనందరిపై నమ్మకంతో గెలిపించారు. మనందరి ప్రవర్తన ప్రజలు ఆమోదించే విధంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం చేస్తోన్న మంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వచ్చే రెండేళ్లలో పోలవరం ఫేజ్ -1 పూర్తి చేస్తాం. ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి, రైతులకు అందిస్తాం. అమరావతికి నిధుల కొరత లేదు. ముందుకు తీసుకెళ్తాం. గత 5 ఏళ్లు కనీసం విశాఖ రైల్వే జోన్ తెచ్చుకోలేక పోయారు. కేంద్రం అడిగిన భూమి ఇవ్వలేక పోయారు. మన ప్రభుత్వం వస్తూనే ల్యాండ్ క్లియర్ చేశాం. తొందర్లోనే విశాఖ రైల్వే జోన్ పనులు మొదలవుతాయి.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read: Chandrababu: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, జగన్ హయాంలో అన్నీ అరాచకాలే - చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు