Chandrababu Naidu Comments: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలను గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని విమర్శించారు. ఆఖరికి తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కూడా మొత్తం కల్తీ చేశారని ఆరోపించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపిన పరిస్థితి ఉందని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సిన తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వును గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వాడినట్లుగా చంద్రబాబు చెప్పారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.


వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం తిరుమలలో అరాచకాలు చేసిందని చంద్రబాబు అన్నారు. తద్వారా వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీశారని అన్నారు. అంతా నాణ్యత లేని పదార్థాలతో తిరుమల లడ్డూను తయారు చేసి, దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను కూడా అపవిత్రం చేశారని విమర్శించారు. జగన్ హాయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడితే.. తాము అధికారంలోకి రాగానే అన్నీ నాణ్యమైన పదార్థాలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నామని చెప్పారు. 


వారికి శిక్ష పడాల్సిందే
వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో ఎన్నో అవకతవకలకు పాల్పడిందని చంద్రబాబు అన్నారు. ఇలా తప్పు చేసి, డబ్బు దండుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని చంద్రబాబు అన్నారు. ‘‘తప్పు చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. అన్నా క్యాంటీన్‌ రద్దు చేసి జగన్‌ దుర్మార్గమైన పని చేశారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడే వాలంటీర్ల వ్యవస్థ గడువు ముగిసింది. అయినా రెన్యువల్‌ చేయలేదు. ఇంకా మరెన్నో తప్పులు వారు చేశారు. జగన్ హయాంలో తప్పులు చేసిన వాళ్లని వదిలిపెట్టబోను.. విచారణలు జరుగుతున్నాయి. అదే సమయంలో కూటమి ప్రభుత్వంలో ఒక్క తప్పు చేయడానికి కూడా వీల్లేదు. అందరూ జాగ్రత్త వహించాలి. వారు మద్యం విధానాన్ని అత్యంత గందరగోళం చేశారు.. అందుకని కూటమి ప్రభుత్వం అక్టోబరు 1 నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకువస్తుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని చంద్రబాబు మాట్లాడారు.


‘‘గత ప్రభుత్వం ఎన్నో నిధులను దుర్వినియోగం చేసింది.. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించింది. అధికారంలోకి వచ్చేసరికి ఖజానాలో ఎక్కడా డబ్బులు లేవు. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అయినా మనం ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం. రాబోయే ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాల్ని యువతకు కల్పించే దిశగా ముందుకు వెళ్తున్నాం. మనం మూడు పార్టీల సమష్ఠి కృషితోనే ఏపీలో ఇంత ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చాం. నా జీవితంలో ఎన్నడూ చూడని విజయం ఇది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే మన రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. కేంద్ర సహాయం వెంటిలేటర్‌పై ఉన్న వ్యక్తికి ఆక్సిజన్‌ లాంటిది’’ అని చంద్రబాబు చెప్పారు.       


Also Read: యువకుడు కూడా చంద్రబాబులా పని చేయలేడు, మేం అండగా ఉంటాం - పవన్ కల్యాణ్