మార్గదర్శి సంస్థ మనీలాండరింగ్, అక్రమంగా డబ్బు తరలింపు సహా కార్పొరేట్ మోసం, బినామీల పేరుతో ఐటీ ఎగవేతలకు పాల్పడిందని, ఈ విషయాలు తమ విచారణలో వెలుగులోకి వచ్చాయని ఏపీ సీఐడీ వెల్లడించింది. ఏపీలో మార్గదర్శి చిట్ ఫండ్స్‎ కేసుపై ఏపీ సీఐడీ అధికారులు ప్రెస్‎మీట్ పెట్టి మంగళవారం (జూన్ 20) వివరాలు వెల్లడించారు.


మార్గదర్శిపై 7 ఎఫ్ఐఆర్‌లు


‘‘మార్గదర్శి చిట్ ఫండ్స్‎పై మార్చి 10న దర్యాప్తు చేపట్టాం. మార్గదర్శి చిట్ ఫండ్స్‎పై ఇప్పటి వరకు 7 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశాం. ఇప్పటి వరకు నలుగురు ఫోర్స్‎మెన్స్ ను అరెస్ట్ చేశాం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సమాచారంతో ఆడిటింగ్ చేశాం. కేసులో A - 1 గా రామోజీరావు, A - 2గా ఎండీ శైలజా కిరణ్ ఉన్నారు. నాలుగు రాష్ట్రాల్లో 108 మార్గదర్శి బ్రాంచ్‎లు నడుస్తున్నాయి. ఏపీలో 37 బ్రాంచ్‎లు, 2,351 చిట్ గ్రూప్స్ ఉన్నాయి. రెండు జీవోల ద్వారా రూ.1,035 కోట్లు అటాచ్ చేశాం. అటాచ్ మెంట్‎లో ఆస్తులు, మ్యూచువల్ ‎ఫండ్స్ కూడా ఉన్నాయి. కంపెనీ మూతపడితే ఖాతాదారులకు చెల్లించాల్సిన బాధ్యత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‎కు ఉంటుంది. అదిపెద్ద చిట్‎ఫండ్స్‎ స్కాంను నిరోధించే ప్రయత్నం చేస్తున్నాం.


చిట్ ఫండ్‎ చట్టం ఉల్లంఘన - సీఐడీ


‘‘1982 చిట్‎ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శికి ఉంది. మార్గదర్శి చిట్‎ఫండ్స్‎ నిధులను ఇతర కంపెనీలకు మళ్లింపు సహా.. వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అమల్లో ఉన్న చాలా చట్టాలను ‎ఉల్లంఘిస్తూ.. పెద్ద ఎత్తున నగదు రూపంలో డబ్బు తరలిస్తున్నారు. వడ్డీ ఇస్తామనే ఆశ చూపించి.. చందాదారుల డబ్బును మార్గదర్శి తనవద్దే ఉంచుకుంటోంది. చిట్ ఫండ్‎ చట్టాన్ని ‎ఉల్లంఘిస్తూ.. ఖాతాల నిర్వహణ, బ్యాలెన్స్ షీట్ దాఖలు చేయట్లేదు.


స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఫిర్యాదు మేరకు మార్గదర్శి చిట్ ఫండ్స్‎పై ఇప్పటి వరకు 7 ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ చెప్పారు. ఈ ఎఫ్ఐఆర్ లో A - 3, A - 4 గా మార్గదర్శి ఫోర్‎మెన్స్ ఉన్నారని చెప్పారు. A - 5గా ప్రిన్సిపల్ ఆడిటర్ కె. శ్రవణ్‎ కుమార్ నిందితులుగా ఉన్నారు. ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను విచారణ చేసినా, వారు సహకరించడం లేదు. వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్న మార్గదర్శి కంపెనీ లెక్కలు చూస్తే కేసు తీవ్రత అర్థం చేసుకోవచ్చు.


ప్రజల సంక్షేమమే ప్రభుత్వ బాధ్యత - సీఐడీ


విచారణలో మార్గదర్శి మనీలాండరింగ్, అక్రమంగా డబ్బు తరలింపు సహా.. కార్పొరేట్ మోసం, బినామీల పేరుతో ఐటీ ఎగవేత తదితర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మార్గదర్శి స్కాంలో విచారణ జరపాల్సిందిగా కేంద్ర విచారణ సంస్థలను కోరాం. మార్గదర్శి నేరం, సహారా, సత్యం కంప్యూటర్స్, శారదా చిట్ ఫండ్ మాదిరిగా ఉంది. మార్గదర్శి భారీ మోసాన్ని అడ్డుకునేందుకు మరింత లోతైన విచారణ అవసరం. ప్రజల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఉండొద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది’’ అని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ వెల్లడించారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial