Anhra News : ఏపీ సీఎం జగన్ (CM Jagan), కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని సీఐడీ చీఫ్ సంజయ్‌ (AP CID Chief Sanjay) హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టులపై ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెట్టామని చెప్పారు. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించామని.. నిందితుల ఆస్తులు కూడా అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.  ఇప్పటికే కొన్నింటిని గుర్తించి తొలగించామన్నారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు.                               


విదేశాల నుంచి పెట్టే పోస్టుల విషయంలో ఎంబసీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.  యూకే, అమెరికా దేశాలకు సీఐడీ బృందాలు పంపామని సీఐడీ చీఫ్ చెప్పుకొచ్చారు.  ఇప్పటికే 45 కేసుల్లో ఐదుగురిపై ఎల్‌వోసీ ప్రోసీడింగ్స్ చేపట్టామన్నారు.  రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అసభ్యకరపోస్టులు పెట్టి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని సీఐడీ చీఫ్ హెచ్చరించారు.  అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి (YSRCP )  చెందిన నేతలపైనే కాకుండా.. ప్రతిపక్ష నేతలపై వస్తున్న సోషల్ మీడియా పోస్టులపై కూడా చర్యలు తీసుకుని పోస్టులు తొలగించాం అని తెలిపారు సీఐడీ చీఫ్.  ఇటీవల న్యాయ వ్యవస్థని కించ పరిచే విధంగా కూడా పోస్టులు పెట్టారని .. వీరిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.                              


సీఎం వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీ కార్తీక్ రెడ్డి, సమర సింహా రెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు అనే అకౌంట్స్ గుర్తించామని తెలిపారు. కొన్ని పోస్టులు విదేశాల నుంచి పెడుతున్నారని అన్నారు.  ఇప్పటి వరకు ఇలా చేసిన నలుగురిపై చర్యలు తీసుకున్నాం.. సోషల్ మీడియా నుంచి అసభ్య పోస్టులు పెట్టే వారు నగరం నుంచి గ్రామ స్థాయికి చేరిందన్నారు.                                   


202 సోషల్ మీడియా అకౌంట్స్ ను మోనటరింగ్ చేస్తున్నాం.. 2 నెలల్లో కొత్తగా 31 కొత్త సోషల్ మీడియా అకౌంట్స్ ను గుర్తించాం.. అసభ్య పోస్టులను షేర్, లైక్ చేస్తున్న వారిపై 2972 సైబర్ బుల్లయింగ్ షీట్స్ ఓపెన్ చేశామని వెల్లడించారు ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌.  మధ్య కాలంలో మంత్రులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి అనుచిత పోస్టులు పెట్టినవారిపై కచ్చితంగా చర్యలుంటాయని హెచ్చరించారు. అయితే  వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టే  పోస్టులు ఘోరంగా ఉంటాయని వారు చేసే ఫిర్యాదుల్ని సీఐడీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. గతంలో న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన వారిని హైకోర్టు చెప్పినా పట్టించుకోకపోవడంతో సీబీఐకి కేసును అప్పగించింది.