AP Cabinet Decisions: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతను సోమవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన ఇసుక విధానానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనుంది. అలాగే, పంటల బీమా పథకానికి సంబంధించి ప్రీమియం చెల్లింపుపై మార్గదర్శకాలు ఖరారు చేసేందుకు ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. అలాగే, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్‌కు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం తెలిపింది. అటు, పౌరసరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు సైతం ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.


అసెంబ్లీ సమావేశాలపై..


అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా కేబినెట్ చర్చించింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలా.?, ఆర్డినెన్స్ తీసుకురావాలా.? అనే దానిపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక శ్వేతపత్రాలను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. టేబుల్ ఎజెండాగా మరికొన్ని అంశాలపైనా చర్చించారు. నెల రోజుల పని తీరు, ప్రజల నుంచి వస్తోన్న అభిప్రాయాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది.


మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కీలక సూచన


ఉచిత ఇసుక విధానానికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కీలక సూచనలు చేశారు. ఇసుక విషయంలో జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని అన్నారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని.. బోట్ సొసైటీలకు కూడా అనుమతిస్తున్నట్లు చెప్పారు. వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరమని.. నదుల్లో పూడిక, బోట్ సొసైటీల ద్వారా 80 లక్షల టన్నుల ఇసుక వస్తుందని పేర్కొన్నారు. కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని.. తమ శాఖల పరిస్థితిని ప్రజలకు వివరించాలని నిర్దేశించారు. వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.


Also Read: Free Bus Service: ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం, అధికారిక ప్రకటన