Free Bus Service Scheme In Andhrapradesh: ఏపీలో మహిళలకు ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Service) అమలు తేదీపై అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అమలు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న ప్రభుత్వం తాజాగా ఈ శుభవార్త అందించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున విశాఖ వేదికగా సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించే ఛాన్స్ ఉంది. అయితే, మంత్రి కొద్దిసేపటికే ఈ ట్వీట్‌ను డిలీట్ చేశారు. 


ఇప్పటికే 'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం' పథకం పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పథకం అమలు తీరును అధ్యయనం చేసిన రాష్ట్ర అధికారుల బృందం దీనిపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించారు. పథకం అమలైతే ఆర్టీసీపై పడే భారం, ఆర్థికంగా ఎలాంటి చర్యలు చేపట్టాలి.?, ఎదురయ్యే సమస్యలు వంటి వాటిపై వివరాలను అందులో పొందుపరిచారు. వీటన్నింటినీ పరిశీలించిన సర్కారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలోనూ ఆగస్ట్ 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది.


అదే రోజు మరో పథకం


మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను సైతం ఆగస్ట్ 15వ తేదీ నుంచే ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. నిరుపేదలకు రెండు పూటలా కడుపు నింపేలా.. తొలిదశలో 183 అన్న క్యాంటీన్లను ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు క్యాంటీన్ల ఏర్పాటుకు టెండర్లు పిలవగా.. ఈ నెల 22 వరకూ గడువు ఉంది. ఈ నెలాఖరులోగా అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థలకు టెండర్లు ఖరారు చేయనుంది. గతంలో ఉన్న అన్న క్యాంటీన్ల భవనాలను రూ.20 కోట్లతో ఇప్పుడు మరమ్మతులు చేస్తున్నారు. అటు, క్యాంటీన్ల నిర్వహణ కోసం దాతల నుంచి విరాళాలు సేకరించాలని సర్కారు భావిస్తోంది. ఇందు కోసం ఓ ట్రస్ట్ ప్రారంభించి.. ప్రత్యేక వెబ్ సైట్ సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. దాతలు ఇచ్చే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, క్యాంటీన్లలో గతంలో కేవలం రూ.5కే ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించేవారు. ఇప్పుడు కూడా అవే ధరలతో భోజనం అందించనున్నట్లు తెలుస్తోంది.


హామీల అమలు దిశగా..


రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నెల రోజుల్లోనే హామీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలుత పింఛన్ల పెంపు, డీఎస్సీ ఉద్యోగాల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక పంపిణీ, అన్న క్యాంటీన్ల ఏర్పాటు వంటి వాటిపై ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు.. పింఛన్ జులై 1 నుంచి రూ.4 వేలకు పెంచుతామన్న హామీని వెంటనే అమలు చేశారు. ఏప్రిల్ ఎరియర్లతో కలిపి ఒకేసారి రూ.7 వేలను పింఛనుదారులకు అందజేశారు. అలాగే, ఇటీవల ఉచిత ఇసుక విధానాన్ని సైతం ప్రారంభించి.. ఇందుకు తగిన మార్గదర్శకాలను సైతం విడుదల చేశారు. తాజాగా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపైనా ఆదేశాలు జారీ చేశారు.