Arunachalam Special Buses: శివం పంచభూతాత్మకం అన్నట్టు..పంచభూతలింగాలుగా శివుడు 5 ప్రదేశాలలో కొలువయ్యాడు. వాటిలో అగ్నికి సంకేతంగా వెలసిన ప్రదేశం అరుణాచలం. సాధారణంగా కొండపై దేవుడు వెలుస్తాడు..కానీ..అరుణాచలంలో కొండే దేవుడిగా సాక్షాత్కరిస్తాడు. పంచభూతాల్లో ఒకటైన అగ్నితత్వానికి నిదర్శనంగా ఇక్కడ కొండ ఎర్రగా కనిపిస్తుంది. ఈ కొండచుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తూ ఆ శివుడి చుట్టూ తిరిగినట్టే. అందుకే ప్రతి పౌర్ణమికి అరుణాచలంలో గిరిప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతారు. ఈసారి గురుపౌర్ణమి కావడంతో భక్తుల రద్దీ మరింత ఉండనుంది.  జూలై 20 శనివారం సాయంత్రం ఐదున్నర సమయానికి పౌర్ణమి ఘడియలు ప్రారంభమవుతాయి. అప్పుడు మొదలైన గిరిప్రదక్షిణ జూలై 21 ఆదివారం సాయంత్రం వరకూ కొనసాగుతుంది. ఈ మేరకు తమిళనాడు అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. 


Also Read: అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ - అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!


TSRTC Special Buses For Arunachalam Giri Pradakshina


ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ నెల 21న గురు పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లే భక్తుల కోసం జూలై 19 నుంచి 22వ  వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు సజ్జనార్ పోస్ట్ పెట్టారు. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్గొండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.  అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్‌ కోసం ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ http://tsrtconline.inను సందర్శించాలని సజ్జనార్‌ సూచించారు. ఈ ప్యాకేజీలోనే ఆయా ప్రాంతాల నుంచి వెళ్లే బస్సుల రూట్ ఆధారంగా... కాణిపాక వరసిద్ది వినాయకుడితో పాటూ శ్రీపురంలోని గోల్డెన్‌ టెంపుల్‌, జోగులాంబ శక్తిపీఠం సందర్శించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఖమ్మం నుంచి పెద్దలకు 4190, పిల్లలకు 4 వేల రూపాయలు టికెట్ ధర నిర్ణయించారు.  గోదావరిఖని నుంచి పెద్దలకు 4850, పిల్లలకు 4050... కరీంనగర్ నుంచి పెద్దలకు 4500, పిల్లలకు 3800 రూపాయలు ... వేములవాడ నుంచి పెద్దలకు రూ. 4500 , పిల్లలకు రూ.3800 బస్ చార్జీ వసూలు చేయనున్నారు..ఇంకా ఆయా ప్రాంతాలను బట్టి టికెట్ రేట్లలో స్వల్ప మార్పులుంటాయి..


Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!


APSRTC Special Buses For Arunachalam Giri Pradakshina 


కాకినాడ‌ నుంచి అరుణాచలం వెళ్లాలి అనుకునే భక్తులకు APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. జూలై 21 గురపౌర్ణమి.  జూలై 19 మధ్యాహ్నం ఒంటిగంటకు కాకినాడ బస్టాండ్ నుంచి అరుణాచలానికి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. జూలై 19 న బయలుదేరి కాణిపాకం, శ్రీ‌పురం ద‌ర్శనం త‌ర్వాత అరుణాచ‌లం చేరుకుంటారు. ఆషాఢ పౌర్ణమి / గురు పౌర్ణమి రోజు  అరుణాచలంలో గిరి ప్రద‌క్షిణ అనంతరం అగ్నిలింగంగా కొలువైన  అరుణాచ‌లేశ్వరుడిని దర్శించుకుంటారు. అనంతరం పెద్ద కంచి మీదుగా శ్రీ‌కాళ‌స్తి ద‌ర్శనం పూర్తి చేసుకుని జూలై 22 రాత్రికి కాకినాడ చేరుకుంటారు. టూర్ ప్యాకేజీ ఇరువైపులా రూ.3,100గా నిర్ణయించింది APSRTC. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రధాన బస్టాండ్ ల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతోంది APSRTC. 


Also Read: తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి - ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!