AP Cabinet Key Decisions: ఏపీ టూరిజం పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించారు. అలాగే, జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దుకు కేబినెట్ (AP Cabinet) ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్ఫ్రా ట్రాన్స్పరెన్సీ యాక్ట్ 2019 రిపీట్ చేయాలని ప్రతిపాదించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ చట్ట సవరణ చేశారు. అటు, డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్‌గా (ఎలైట్ యాంటీ నార్కటిక్ గ్రూప్) మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.
మరిన్ని నిర్ణయాలు
- 2024 - 25 క్రీడా పాలసీకి కేబినెట్ ఆమోదం లభించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కోసం గృహ నిర్మాణ శాఖ చేసుకోనున్న ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ఏపీ టవర్స్ లిమిటెడ్‌ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ టవర్స్ లిమిటెడ్‌కు చెందిన మూలధనం, ఆస్తులు, అప్పుల బదలాయిస్తూ ప్రతిపాదించారు.
- కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
- నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- అలాగే, లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనే దానిపై భేటీలో చర్చించారు. పార్లమెంట్లో అనుసరించిన విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించారు.
- రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కొత్తగా టెండర్లు పిలిచి అమరావతి నిర్మాణ పనులు కొనసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు పంపింది.