Maharastra And Jharkhand Assembly Elections Comleted: మహారాష్ట్ర (Maharastra), ఝార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 288 నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో బుధవారం ఒకే విడతలో పోలింగ్ సాగింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి బరిలో నిలిచాయి. ఇప్పటివరకూ మహారాష్ట్రలో 58.22 శాతం, ఝార్ఖండ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో 67.59 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇంకా క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రాబల్యం ఉన్న గడ్చిరోలిలో అత్యధికంగా 62.99 శాతం పోలింగ్ నమోదు కాగా.. థానేలో అత్యల్పంగా 38.94 శాతం ఓటింగ్, ముంబైలో 39.34 శాతం, ముంబై సబర్బన్‌లో 40.89 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
అటు, ఝార్ఖండ్‌లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఈ నెల 13న తొలి విడతలో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 38 స్థానాలకు బుధవారం పోలింగ్ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. 38 స్థానాల్లో 528 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ కలిసి మహాఘాట్ బంధన్ పేరుతో పోటీ చేశాయి. బీజేపీ, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయూ, లోక్ జన్‌శక్తి రామ్ విలాస్ పార్టీలతో కలిసి ఎన్డీయే కూటమిగా పోటీ చేశాయి.
చెదురుమదురు ఘటనలు
మహారాష్ట్రలో పలుచోట్ల చెదురుమదురు ఘటనలతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు జరిగాయి. బీడ్ జిల్లాలోని పర్లి నియోజకవర్గం ఘట్నందూరు గ్రామంలో పోలింగ్ బూత్ ధ్వంసమైంది. బూత్‌లోని ఈవీఎం మెషీన్లు, టేబుల్స్, ఇతర సామాగ్రి కిందపడ్డాయి. దీంతో అక్కడ కొద్దిసేపు పోలింగ్ అధికారులు నిలిపేశారు. అయితే, పోలింగ్ బూత్ ధ్వంసానికి కారణం ఏంటనేది తెలియరాలేదు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్సీ)కి చెందిన స్థానిక నేత మాధవ్ జాదవ్‌పై పర్లీ టౌన్‌లోని బ్యాంక్ కాలనీ ప్రాంతంలో దాడి జరిగింది. అధికారంలో ఉన్న మహాయుతి కూటమి కార్యకర్తల దూకుడు కారణంగా పోలింగ్ బూత్ వద్ద గొడవ జరిగిందని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి ఆరోపించింది. ఈ క్రమంలో కార్యకర్తలు తోసుకోవడం వల్లే ఈవీఎం మిషన్లు కిందపడ్డాయని పేర్కొంది. కాగా, పోలింగ్ బూత్ వద్ద పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.
Also Read: School Fees: ఒకటో తరగతి ఫీజు రూ.4లక్షలు - పిల్లల చదువు కూడా లగ్జరీనే- వైరల్ అవుతున్న ఓ తండ్రి ఆవేదన