ABP Affect :   ఆంధ్రప్రదేశ్ బీజేపీ  ఎస్సీ  మోర్చా అధ్యక్షడు గుడిసె దేవానంద్, ఆయన కుమారుడు సాయి దేవానంద్ .. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సంతకాన్ని ఫోర్జరీ చేసి..ఓ నకిలీ పోస్టింగ్ ఆర్డర్ ను తయారు చేసిన వ్యవహారం ఏపీ బీజేపీలో కేలకలం రేపింది. ఓ మహిళ నుంచి రూ. కోటికిపైగా నగదు వసూలు చేసినట్లుగా ఏబీపీ దేశం ప్రకటించింది. ఢిల్లీలో ఈ అంశంపై కేసు నమోదైన విషయాన్ని వెల్లడించింది. ఈ వ్యవహారం ఏపీ బీజేపీ వర్గాల్లో కలకలం రేపింది. గుడిసె దేవానంద్, ఆయన కుమారుడి వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించి.. అన్ని వివరాలు తెలుసుని .. అంతా నిజం అని తేలడంతో పార్టీ పదవికి.. పార్టీకి రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో గుడిసె దేవానంద్ కుమారుడు .. బీజేపీ యువమోర్చా పదవిలోఉన్న సాయిదేవానంద్  పదవికి , పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్దిగత కారణాలు, ఆర్థిక సమస్యలు అని రాజీనామా లేఖలో చెప్పినప్పటికీ.. ఆయన అక్రమాలకు పాల్పడటమే కారణం అని తెలుస్తోంది.  దళితమోర్చా పదవి నుంచి దేవానంద్ ను కూడా రేపోమాపో తప్పించనున్నారని చెబుతున్నారు. 
 
అజయ్ భల్లా సంతకాన్ని ఫోర్జరీ చేసి నకలీ అపాయింట్‌మెంట్ లెటర్          
 
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆఫీసులో ఓఎస్డీ నియామకం పేరుతో అజయ్ భల్లా సంతకం ఫోర్జరీ చేసి మరీ అపాయింట్ మెంట్ లెటర్ సృష్టించి.. ఆ మహిళ వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదును దేవానంద్, ఆయన కుమారుడు సాయి దేవానంద్ వసూలు చేశారన్న ఆరోపమలు వచ్చాయి. దీనిపై ఢిల్లీలో కేసు నమోదయింది.   ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో   కిషన్ రెడ్డి కార్యాలయం ఫిర్యాదు  చేసింది. కిషన్ రెడ్డి కార్యాలయం అధికారి ప్రణవ్ మహాజన్  ఏప్రిల్ 27న ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన  పై 468, 471 ఐపిసి సెక్షన్ ల కింద కేస్ నమోదు  అయింది. 


దేవానంద్ వ్యాపార సంస్థ ఖాతాలో డబ్బులు జమ అయినట్లు గుర్తింపు


ఢిల్లీ పోలీసుల విచారణలో దేవానంద్  ఖాతాలో డబ్బులు జమ అయినట్లుగా తేలింది. ఢిల్లీలో నమోదైన కేసునకు సంబందించి... అక్కడి పోలీసులు  బాధితులు ఎవరికి డబ్బులు ఇచ్చారో ఆధారాలు తీసుకున్నారు. పలమనేరులో బీజేపీ ఎస్సీ మోర్చా ఏపీ అధ్యక్షుడు గుడిసె దేవానంద్‌కు సంబంధించిన పెట్రోల్ బంక్ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. దీనికి సంబంధించి పలమనేరులో బ్యాంక్  సిబ్బంది  వద్ద నుంచి కూడా ఢిల్లీ పోలీసులు ఆధారాలు సేకరించారు. 


దేవానంద్ ఆయన కుమారుడిపై అనేక వివాదాలు              


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ డైరక్టర్ గా పదవి పొందిన ఆయన పై చాలా చీటింగ్ కేసులు నమోదయ్యాయి. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎస్పీ కార్పొరేషన్ నిధులను కూడా దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.  ఇలా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరి మోసాలు చేయడం దేవానంద్‌కు అలవాటుగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై పదికిపైగా కేసులు వివిద పోలీస్ స్టేషన్లలో నమోదయినట్లుగా తెలుస్తోంది.  టీడీపీ ఓడిపోయాక బీజేపీలో చేరి ఎస్సీ మోర్చా అధ్యక్ష పదవి పొందారు.  ఆయన కుమారుడు యువ మోర్చాలో చేరి దందాలు ప్రారంభించారు. మోసపోయిన మహిళ  వద్ద నుంచి ఆయనకు ఉన్న పెట్రోల్ బంకు సంస్థ ఖాతాలోకి లక్షల రూపాయల నగదు బదిలీ చేయించుకున్న బ్యాంక్ స్టేట్‌మెంట్లను బాధితులు విడుదల చేశారు. అలాగే దేవానంద్ కుమారుడితో చేసిన వాట్సాప్ చాట్స్ కూడా విడుదల చేశారు.   


దేవానంద్ తీరుపై హైకమాండ్ ఆగ్రహం       


బీజేపీలో చేరిన తర్వాత సంతకాలు కూడా ఫోర్జరీ చేస్తున్నారు. అయితే ఈ మోసాల వెనుక తన ప్రమేయం లేదని.. దేవానంద్ హైకమాండ్ వద్ద వాదిస్తున్నారు. తన కుమారుడు పనేని చెప్పి ఆయనతో రాజీనామా చేయించారు. కానీ.. తండ్రికి తెలియకుండా కుమారుడు మోసాలు చేయలేరని.. ఆయన వ్యాపార సంస్థ ఖాతాలో నేరుగా డబ్బులు జమ కావడమే దీనికి సాక్ష్యం అంటున్నారు.  ఈ అంశంపై హైకమాండ్..  కొద్ది రోజుల్లో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial