అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యావ్యవస్థలో మార్పులు చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు సీఎం జగన్. విజయవాడలో జరిగిన జగనన్న ఆణిముత్యాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టెన్త్, ఇంటర్‌లో  టాపర్స్‌ను సన్మానించారు. మట్టి నుంచి పెరిగిన ఈ మొక్కలు మహా వృక్షాలై, ప్రపంచానికే అభివృద్ధి ఫలాలు అందించాలని కోరుకుంటున్నాను అన్నారు. అందర్నీ చూస్తుంటే గవర్నమెంట్ బడి, గవర్నమెంట్ కాలేజీలను మరింత గొప్పగా మార్చాలనే కోరిక పెరుగుతోందన్నారు. పేద పిల్లలు ఏ ఒక్కరూ కూడా పేదరికం వల్ల చదువులకు దూరం కాకూడదని ప్రభుత్వం గట్టిగా నిర్ణయించిందని తెలిపారు. 


"మీరు వెళ్లే గవర్నమెంట్‌ బడి నాడు-నేడు ద్వారా రూపురేఖలు మారుతున్నాయి. మిడ్‌ డే మీల్ కూడా జగనన్న గోరుముద్దగా మార్పులతో అందిస్తున్నాం. బడులు తెరిచే సమయానికి జగనన్న విద్యా కానుక అందిస్తున్నాం. గవర్నమెంట్ బడి నాలుగేళ్లలోనే ఇంగ్లిష్‌కు మీడియం మారింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్ అందుబాటులోకి వచ్చింది. పాఠ్యపుస్తకాలన్నీ సిలబస్ మారాయి. బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ తెచ్చాం. బైజూస్ కంటెంట్‌ గవర్నమెంట్ బడుల్లో అందుబాటులోకి తెచ్చాం. మనం చదువుకుంటున్న బడుల్లో సదుపాయాలు అన్నీ మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 


గతంలో క్లాస్ టీచర్లే సరిగ్గా ఉంటారా ఉండరా అనే పరిస్థితుల నుంచి సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులో ఉంచే దిశగా అడుగులు పడుతున్నాయి. క్లాస్‌లలో డిజిటల్ బోధన కోసం ఆరో తరగతి నుంచి ప్రతి పిల్లాడికీ ఐఎఫ్పీ ప్యానెల్స్ బిగించి డిజిటల్ బోధన చేయిస్తున్నాం. 8వ తరగతి పిల్లలకు కంటెంట్ లోడెడ్ ట్యాబ్‌లను ఇస్తూ ప్రోత్సహిస్తున్నాం. మన పేదింటి పిల్లలందరూ అంతర్జాతీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి మూడో తరగతి నుంచి టోఫెల్ ఎగ్జామ్ కు ప్రిపేర్ చేస్తున్నాం. అంతర్జాతీయ సర్టిఫికెట్ ఇచ్చే గొప్ప అడుగు పడుతోంది. పిల్లలు వినడం, మాట్లాడటం రెండింటిలో కూడా ఇంగ్లిష్‌లో ఇక అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చే కార్యక్రమం మన గవర్నమెంట్ బడుల్లో జరుగుతోంది. ఇలాంటి మార్పులు గవర్నమెంట్ బడుల్లో రాగలుగుతాయా? ఇది సాధ్యమయ్యే పనేనా అనే పరిస్థితి నుంచి.. ఇవన్నీ మన గవర్నమెంట్ బడులే.. ప్రైవేట్ బడులకు గవర్నమెంట్ బడులతో పోటీ పడక తప్పదు అనే పరిస్థితి తీసుకొచ్చాం.


ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీతో బయటకు రావాలి. ఈ క్రమంలో ఏ పిల్లాడు గానీ, తల్లిదండ్రులు గానీ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో ఉండాలని అనే తాపత్రయంతో విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇటువంటివన్నింటికీ మొత్తం ఫీజులన్నీ ప్రభుత్వమే భరిస్తోంది. విదేశాల్లో కూడా టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీల్లో 350 కాలేజీల్లో ప్రతి పిల్లాడికీ సీటు తెచ్చుకోండి.. మీకు మీ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుంది. కోటీ 25 లక్షలైనా కూడా మీరు భయపడాల్సిన పని లేదు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా బడులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమం తీసుకొచ్చాం.


మన పిల్లలందరూ కూడా ప్రతి రంగంలోనూ ఎదగాలి. ఎదగడం కూడా కాదు.. ఎగరాలి. ప్రపంచంలో వస్తున్న ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్.. వీటిని అనుసరించేవారుగా మన వాళ్లు ఉండకూడదు. వీటిలో ప్రతి రంగంలోనూ ప్రపంచానికి లీడర్లుగా మన పిల్లలు ఉండాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. ఇది జరగాలంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలి. అందుకే ఈ నాలుగు సంవత్సరాల్లో మన ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ దేశంలో ఎవరూ పెట్టి ఉండరు. 


రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ బడుల్లో ఐబీ సిలబస్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ పరీక్షల మాదిరిగానే మన పరీక్ష పత్రాలు కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ బడుల్లో చదువుకుంటున్న పేద వర్గాలు రేప్పొద్దున ప్రపంచాన్ని ఏలే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుంది. మనం చూస్తాం. లీడర్ షిప్ క్వాలిటీస్ పెంచే విధంగా మన చదువులు ఉన్నాయి. 


టెన్త్, ఇంటర్, ఇంజనీరింగ్, మెడిసిన్ లేదా ఏదో ఒక డిగ్రీ తెచ్చుకోవడమే కాకుండా చదువులు వేగంగా మారుతున్నాయి. ప్రపంచాన్ని శాసించబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, మెషీన్ లెర్నింగ్, ఛాట్ జీపీటీ యుగంలో ఉన్న పిల్లలందరూ కూడా ఎంతగా ఎదగాలి అన్నది ఆలోచించాలి. ఆ స్థాయిలో ఎడ్యుకేషన్ రంగం మారబోతోంది. మార్పు చేస్తాం. ఈ మార్పును ప్రతి పేద వాడికి తీసుకురావాలి. 


టాప్ ర్యాంకులు తెచ్చుకున్నమీరే కాదు.. మీతోపాటు ఏ ర్యాంకూ తెచ్చుకోలేని వాళ్లు కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. సంకల్పం గట్టిదైతే రిజల్ట్ ఆటోమేటిగ్గా వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. మాణిక్యాలన్నీ మట్టిలోనే దొరుకుతాయి. అరక దున్నినప్పుడు వజ్రాలు బయటికి వస్తాయని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. గవర్నమెంట్ బడుల్లో కార్పొరేట్ కాలేజీలకు మించి సదుపాయాలు అందిస్తామని తెలియజేస్తున్నా. గవర్నమెంట్ బడికి జీవం పోస్తూ ఆణిముత్యాలను సత్కరించే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. " చెప్పుకొచ్చారు. 


జగనన్న ఆణిముత్యాల పేరుతో చేసే సత్కారాలు వారం రోజుల పాటు కొనసాగాయి. పదో తరగతిలో టాప్‌ మార్క్‌లు వచ్చిన వారికి లక్ష, రెండో స్థానంలో ఉన్న వారికి రూ.75 వేలు, మూడో స్థానంలో ఉన్న వారికి రూ. 50 వేలు ప్రభుత్వం ఇస్తోంది. 
పాఠశాల స్థాయిలో కూడా 20,299 మందికి నగదు పురస్కారం ఇచ్చారు. టాపర్‌లకు రూ.3,000, రెండో స్థానంలో ఉంటే రూ.2,000, మూడో స్థానంలో ఉంటే రూ.1,000 ఇచ్చారు. 


నియోజకవర్గ స్థాయిలో కూడా 681 మంది టాపర్లకు నగదు బహుమతులు ఇచ్చారు. టాప్ ర్యాంకర్లకు రూ.15,000, రెండో స్థానంలో ఉన్న వారికి రూ.10,000, మూడో స్థానంలో ఉన్న వారికి రూ.5,000 అందించారు. జిల్లా స్థాయిలో 609 మందిని ఎంపిక చేసి వారి మూడ కేటగిరీలుగా విభజిస్తారు. జిల్లా టాపర్లకు రూ.50,000, రెండో స్థానంలో ఉంటే రూ.30,000, మూడో స్థానంలో రూ.15,000 ఇస్తారు. 


ఇంటర్‌లో 26 మంది టాపర్స్‌కు రూ. లక్ష రూపాయలు అందించారు. జిల్లా స్థాయిలో 391 మంది టాపర్లకు రూ.50,000 చొప్పున అందజేశారు. నియోజకవర్గ స్థాయిలో 662 మందికి రూ.15,000 చొప్పున ఇచ్చారు. మొత్తం 22,710 మంది టెన్త్‌, ఇంటర్ విద్యార్థులకు ఈ ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రతి ఒక్క విద్యార్థికి నగదుతోపాటు సర్టిఫికేట్, మెడల్‌ ఇచ్చారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial