వరుసగా భారీ సభలు, అవి చాలవన్నట్లుగా జిల్లాల వారీగా కూడా సభలు, అయినా స్పందన అంతంత మాత్రమే. ఈ పరిస్థితికి కారణం ఏంటీ అనే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పెద్దలను వెంటాడుతోంది. 


వరుసగా భారీ ఎత్తున సభలు నిర్వహించారు. కేవలం 18గంటల వ్యవధిలోనే ఇద్దరు కీలక నేతలు రాష్ట్రానికి వచ్చిమరీ ప్రసంగించారు. అధికారంలో ఉన్న వైఎఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై విమర్శలు గుప్పించారు.. అయినా పార్టీకి మాత్రం ఎటువంటి మైలేజ్‌ రాలేదు. చర్చా వేదికలకు మినహా ప్రజల్లోకి వెళ్ళేందుకు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుంజుకోవాలని భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదనే అభిప్రాయంలో నేతలు ఉన్నారని అంటున్నారు. 


శ్రీకాళహస్త, విశాఖపట్టణం వేదికగా భారతీయ జనతా పార్టీ నేతలు భారీ సభలు నిర్వహించారు. అగ్రనేతలు వచ్చారు. జనసమీకరణ కూడా చేశారు. కానీ ఆ ఊపు ఒకట్రెండు రోజులు కూడా కనిపించలేదు. అగ్రనేతలు ఇచ్చిన ఉత్సాహాన్ని రాష్ట్రంలో కంటిన్యూ చేయలేకపోయారనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉందని అంటున్నారు.


అధికార పక్షాన్ని టార్గెట్ చేయలేక...
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులు సరైన రీతిలో టార్గెట్ చేయలేకపోయారనే విమర్శలు లేకపోలేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా , కేంద్ర హోం మంత్రి స్థాయిలో సభలో పాల్గొన్న అమిత్ షా చేసిన కామెంట్స్ రాజకీయంగా సంచలనంగా మారాయి. ఇప్పటి వరకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. అయితే ఉన్నపళంగా ఏపీ సర్కారును బీజేపీ టార్గెట్ చేసింది. రాజకీయంగా విమర్శించుకోవటం కూడా చర్చకు దారితీసింది. అయితే కీలక నేతలు ఇచ్చిన స్టేట్ మెంట్‌లను ఆధారంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లడంలో రాష్ట్ర స్థాయి నాయకులు ఫెయిల్ అయ్యారనే విమర్శలు లేకపోలేదు. 


అక్కడ అలా ఉంటే ఇక్కడ ఇలానే ఉంది
భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు అధినాయకత్వం వద్ద పలు కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన నిధులు కేటాయించటం, పోలవరం పనులకు నిధులు ఇచ్చింది. వాటి గురించి తగిన సమాచారాన్ని కనీసం రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతలకు కానీ, ఢిల్లీకి వెళ్ళిన సొంత పార్టీ నేతలకు కానీ  హై కమాండ్ నుంచి సమాచారం లేదు. దీంతో కేంద్రం నుంచి నిధులు వచ్చినా, వాటిని తీసుకువచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమనే భావన ప్రజల్లో ఏర్పడింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి , భారతీయ జనతా పార్టీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయం బలపడిందని అంటున్నారు. దీనంతటికీ కేంద్ర నాయకత్వమే కారణమని అంటున్నారు. 


ఇలాంటి పరిస్దితుల్లో ఉన్నఫళంగా ఢిల్లీ నుంచి ఇద్దరు కీలక నేతలు వచ్చి, రాష్ట్రంలో సభలు పెట్టి, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించటం ద్వార ప్రజల్లో అనుకున్నంత స్థాయిలో స్పందన రాలేదంటున్నారు. దానికి రాష్ట్ర నాయకులను బాధ్యుతలను చేస్తే ఎలా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.  భవిష్యత్ కార్యచరణ మరింత కీలకంగా ఉండాలని పార్టీ నేతలు తమ అభిప్రాయంగా పార్టీ పెద్దల వద్ద ప్రస్తావిస్తున్నారని అంటున్నారు.