AP Assembly Session 2022: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(Konijeti Roshaiah) మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై సభలో సీఎం వైఎస్‌ జగన్‌(CM YS Jagan) మాట్లాడారు. రోశయ్య విద్యార్థి నాయకుడు స్థాయి నుంచి ముఖ్యమంత్రి, చివరకు గవర్నర్‌గా ఎదిగారని సీఎం జగన్ అన్నారు. ఆయన ఏ బాధ్యత నిర్వర్తించినా అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఉమ్మడి ఏపీలో ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద రోశయ్య పనిచేశారన్నారు. వైఎస్సార్‌(YSR) హయాంలో రోశయ్య ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారని సీఎం గుర్తుచేసుకున్నారు. ఇరువురి మధ్య మంచి సంబంధాలు ఉండేవన్నారు. ఇద్దరూ మంచి స్నేహితులని సీఎం జగన్ అన్నారు. అలాంటి ఆయన ఇవాళ మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. 


మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం 


అసెంబ్లీ సమావేశాల్లో ఇటీవల మృతి చెందిన మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సంతాపం తెలిపారు. వల్లూరి నారాయణమూర్తి, వీవీఎస్‌ఎస్‌ చౌదరి, కడప ప్రభాకర్‌రెడ్డి, మంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి, గారపాటి సాంబశివరావు, టీఎన్‌ అనసూయమ్మ, పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి, యల్లసిరి శ్రీనివాసులురెడ్డి, యడ్లపాటి వెంకట్రావు మృతికి సభలో సంతాపం తెలిపారు. అనంతరం స్పీకర్‌ తమ్మినేని సీతారాం సూచనతో సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.


టీడీపీ తీరుపై సీఎం జగన్ సీరియస్ 


గవర్నర్ ప్రసంగం(Governor Speech)పై చీఫ్ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి శాసనసభలో ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు గవర్నర్‌ ప్రసంగం సమయంలో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. అనంతరం మాట్లాడిన సీఎం జగన్... టీడీపీ సభ్యులు అనుచిత ప్రవర్తనతో గవర్నర్‌ను అవమానించారని మండిపడ్డారు. చంద్రబాబు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో ఆయనకే తెలియట్లేదన్నారు. గవర్నర్‌ వయసుకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరికీ ఉందన్న సీఎం.. గవర్నర్‌ పట్ల ఇలాంటి ప్రవర్తన గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ ఈ విధంగా ప్రవర్తించలేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలంటే చంద్రబాబుకు కడుపు మంట అని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు(Chandrbabu) దిగజారుడు రాజకీయాలకు ఈ సంఘటన నిదర్శనమన్నారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు పథకం మాత్రమే గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు టీడీపీ(TDP) ఎప్పుడూ విలువ ఇవ్వలేదన్నారు. ఏ ఎన్నికల్లో అయినా ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారన్నారు. 87 మున్సిపాలిటీలకు 84 గెలిచామన్నారు. 12 కార్పొరేషన్లలలో వైసీపీ గెలుచుకుందన్నారు.