తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ఇతర నేతలు పాల్గొన్నారు. వైఎస్ వర్థంతి సందర్భంగా స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేపట్టారు పార్టీ శ్రేణులు.
14ఏళ్ల క్రితం... సరిగ్గా సెప్టెంబర్ 2న ఇదే రోజున తెలుగు ప్రజలకు ఊహించని షాక్ తగిలిందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్ ప్రయాణించిన విమానం కనిపించలేదన్నారు. ఆయన ఎక్కడికి వెళతారు.. కచ్చితంగా వస్తారని ఒక ధీమాతో ఉన్నామన్నారు. కానీ దురదృష్టం వెంటాడి.. ఆయన నిష్క్రమించారని చెప్పారు. ఆయన ఇకలేరన్న వార్త... చాలా మంది గుండెలు పగిలేలా చేసిందన్నారు. మహానేత లేరన్న బాధ తట్టుకోలేక ఎంతో మంది ప్రాణాలు విడిచారని గుర్తుచేసుకున్నారు.
ప్రజల కోసం వైఎస్‌ఆర్ ఎంతో చేశారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంచి మనసు, దానికి తగ్గ తెలివి ఉంటే.. ఒక వ్యక్తి ఏదైనా చేయగలడని వైఎస్ఆర్ నిరూపించారన్నారు. ఒక పాలకుడిగా... ప్రజల జీవితాలపై ఎంతో ప్రభావం చూపగలరు అనడానికి వైఎస్‌ఆర్ ఒక ఉదాహరణ అన్నారు. ప్రజాసంక్షేమం కోసమే పాటుపడిన ఆయన... కోట్లాది ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించారు. ప్రజలంతా ఆయన కుటుంబ సభ్యులే అనుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం కలలు కనడమే కాకుండా... ఆచరణలోకి తీసుకొచ్చారన్నారు. రాష్ట్రాన్ని దేశంలో తలమానికంగా నిలబెట్టారు. ఇంకా.. 200 ఏళ్లు అయినా ప్రజలకు వైఎస్‌ఆర్ చేసిన సేవ మర్చిపోలేదని అన్నారు.
వైఎస్‌ఆర్ మరణం తర్వాత అలుముకున్న చీకటిని తొలగించేందుకు... ఆయన తనయుడు జగన్ ఒక వెలుగు రేఖలా ప్రజల ముందుకొచ్చారన్నారు. వైఎస్సార్ తర్వాత ప్రజల జీవితాల్లోని అంధకారాన్ని తొలగించి... వారి బతుకుల్లో వెలుగులు నింపిన వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. మాట మీద నిలబడే తత్వమే ప్రజల్లో జగన్‌పై నమ్మకం పెంచిందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి... నిజమైన రాజకీయ వారసుడిగా జగన్ పాలన చేస్తున్నారని అన్నారు.
వైఎస్ఆర్ దూరమైన 14ఏళ్లు గడిచినా.. ఆయన మరణాన్ని ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నామన్నారు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు. ఒక్కసారి కాలం వెనక్కి వెళితే బాగుండు అని అన్నారు. సీఎం జగన్ పాలనతో... ఇప్పటికీ వైఎస్ఆర్ సజీవంగా ఉన్నట్లే ఉందంటున్నారు. రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో సీఎం జగన్ నడుస్తున్నారన్నారు. తండ్రి చూపిన సంక్షేమ బాటలోనే ముందుకు వెళ్తూ... ఆయన అడుగు వేస్తే.. జగన్ నాలుగు అడుగులు వేస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో పేదల గుండె చప్పుడు వైఎస్ఆర్ అని అన్నారు మంత్రి మేరుగ నాగార్జున. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అభివర్ణించారు. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గొప్ప పాలకుడని కొనియాడారు. తండ్రి బాటలో నడుస్తున్న జగన్.. ఆయన ఆలోచనలను ముందుకు తీసుకుని వెళుతున్నారన్నారు. వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా.. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది వైఎస్‌ఆర్‌సీపీ. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో.. జ్యోతి ప్రజ్వలన చేసి.. సేవా కార్యక్రమాలను ప్రారంభించారు సజ్జల రామకృష్ణారెడ్డి.