ఆంధ్రప్రదేశ్‌కి రెయిన్‌ అలర్ట్‌ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటిచింది. నైరుతి రుతుపవనాలు  కోస్తాంధ్రపై సాధారణంగాను.. రాయలసీమలో చురుగ్గాను కదులుతున్నాయి. వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో పశ్చిమ  బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో... ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 


రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయని అంచనా వేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.  వేటకు వెళ్లే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. వేటకు వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది.


బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రాంతం నుంచి తెలంగాణ వరకు ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ద్రోణి పయనిస్తోంది. వీటన్నిటి ఫలితంగా రానున్న నాలుగు  రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ  హెచ్చరించింది.కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడొచ్చని హెచ్చరించింది. చెట్ల కింద నిల్చోవద్దని.. జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.


ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న పలు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా పినపెంకిలో అత్యధికంగా 9.10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో 7.50 సెంటీమీటర్లు, కాకినాడ జిల్లా కందరాడలో 7.10 సెంటీమీటర్లు, అనకాపల్లి జిల్లా చోడవరంలో 6 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా రాచెర్లలో 5.20 సెంటీమీటర్లు, నంద్యాల జిల్లా కొండమనాయనిపల్లెలో 5.10 సెంటీమీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో అత్యధికంగా 8.24 సెం.మీ. వర్షం కురవగా.. అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరులో 5.94 సెంటీమీటర్లు, తాడిపత్రిలో 5.26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఏపీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో.. విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వార్త రైతుల్లో సంతోషం నింపుతోంది. ప్రాజెక్టులు నిండుకున్న వేళ... ఈ వర్షాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.