Vijayawada Bus accident: విజయవాడలో సోమవారం ఘోర బస్సు ప్రమాద దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నెహ్రూ బస్టాండులో ఏసీ బస్సు ప్లాట్ ఫాం మీదకు దూసుకురాగా, గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం రావిపాడుకు చెందిన ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగి వీరయ్య, ఓ మహిళ, ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ డ్రైవర్ రివర్స్ గేర్ కు బదులుగా ఫస్ట్ గేర్ వేయడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఎక్సలేటర్ పట్టేయడం వల్లే రివర్స్ గేర్ వేశానని అయినా ఫలితం లేకపోయిందని బస్సు డ్రైవర్ తెలిపారు. అయితే, తాజాగా ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజీని అధికారులు విడుదల చేశారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.
విజయవాడ బస్సు ప్రమాదం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. బస్సులన్నీ కండిషన్ లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నా, ప్రమాదాల నేపథ్యంలో బస్సుల ఫిట్ నెస్ పై విమర్శలు వస్తున్నాయి. కాగా, సోమవారం ప్రమాదానికి గురైన బస్సు ట్రాన్స్ మిషన్ విధానంలో నడుస్తుంది. విజయవాడ ఆటోనగర్ డిపోలో ఇలాంటివి 13 బస్సులున్నా, తరచూ పాడవుతున్న కారణంగా ఆరింటినే నడుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో డ్రైవర్లకు బెంగుళూరులోని వోల్వో కంపెనీ కేంద్రానికి పంపి శిక్షణ ఇప్పించేవారు. కొంతకాలంగా డ్రైవర్లకు డిపోకి చెందిన సేఫ్టీ డ్రైవింగ్ ఆఫీసర్ తోనే శిక్షణ ఇప్పిస్తున్నారు.
ఎక్సలేటర్ సమస్య
ప్రమాదానికి గురైన బస్సులో కొంతకాలంగా ఎక్సలేటర్ సెన్సార్ సమస్య ఉందని సమాచారం. ఎక్సలేటర్ తొక్కినప్పుడు, కాలు లేపినప్పుడు దాని కింద రోలర్ ముందుకు, వెనక్కు కదులుతుంది. ఇది సెన్సార్ కు అనసుంధానమై ఉంటుంది. కొంతకాలంగా సెన్సార్ స్ట్రక్ అవుతోందని, పెడల్ తొక్కి, దానిపై కాలు తీస్తే వెంటనే పైకి రాకుండా అలాగే ఉండిపోతుందని డ్రైవర్లు గుర్తించారు. దీని వల్ల బస్సు ఒక్కసారిగా ముందుకు మజంప్ అవుతోందని చెబుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ సైతం ఇదే విషయం తెలిపారు. వారం కింద ఈ బస్సు నడిపిన ఓ డ్రైవర్, ఆదివారం మరో డ్రైవర్ సైతం రిపేర్ ఎట్ గ్యారేజ్ షీట్ లో ఎక్సలేటర్ సమస్యను సరి చేయాలని రాసినట్లు తెలుస్తోంది.
పెడల్ వద్ద ప్లాస్టిక్ కవర్
ప్రమాదానికి గురైన బస్సులో ఎక్సలేటర్ పెడల్ కు ప్లాస్టిక్ కవర్ చుట్టి ఉండడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెడల్ కిందకు తొక్కినప్పుడు అది రోలర్ వద్ద ఇరుక్కుపోకుండా పైకి వచ్చేలా లాక్ పిన్ ఉంటుందని, అది వేయకపోవడంతోనే చాలా కాలంగా డ్రైవర్లే ఇలా ప్లాస్టిక్ కవర్ చుట్టినట్లు చెబుతున్నారు. అయితే, అధికారులు మాత్రం పెడల్ పై డ్రైవర్ కాలి గ్రిప్ కోసం అలా ఏర్పాటు చేసుకున్నారని అంటున్నారు. ఎక్సలేటర్ పెడల్ వద్ద ఉండే సెన్సార్ తడిచిపోకుండా ఇలా ప్లాస్టిక్ కవర్ చుట్టినట్లు మెకానిక్స్ చెబుతున్నారు. కాగా, ప్రమాదానికి గురైన బస్సు 10 లక్షల 65 వేల కి.మీ తిరిగిందని, ఇది తరచూ మరమ్మతులకు గురవడం, మార్గమధ్యలో ఆగిపోవడం జరుగుతూనే ఉందని తెలుస్తోంది.
సిక్ లీవ్ తర్వాత విధులకు
మరోవైపు, ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ ఇటీవల్ బైక్ ప్రమాదంలో గాయపడి సిక్ లీవ్ తీసుకుని, ఆ తర్వాత విధులకు హాజరవుతున్నారు. వాస్తవానికి ఆయనకు సోమవారం వారాంతపు సెలవు కాగా, లీవ్స్ సర్దుబాటు క్రమంలో సోమవారం సెలవైనా విధులు నిర్వహించాల్సి వచ్చింది. మరోవైపు, ఈ ప్రమాదంలో డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.
Also Read: Yatra 2 : 'యాత్ర 2'లో సోనియా గాంధీ - ఇటలీ నుంచి కాదు, జర్మన్ నటి!