తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటికి పరీక్షలు చేయించుకున్నారు. ఇవాళ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో వైద్యులు బాబు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయనున్నారు. చంద్రబాబు రాజమహేంద్రవరం జైలులో ఉన్నప్పుడు తీవ్ర అలర్జీ, అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని రోజుల క్రితం ఏఐజీ ఆసుపత్రిలో బాబు జాయిన్ అయ్యారు. చంద్రబాబు ఒక రోజు అంతా ఆసుపత్రిలోనే ఉండగా వైద్యులు వివిధ పరీక్షలు చేశారు. సోమవారం మరోసారి ఏఐజీ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. ఆసుపత్రి వైద్యులు సోమవారం మరోసారి ఆయనకు పలు పలు రకాల వైద్య పరీక్షలు చేశారు.
గత నెల 31న జైలు నుంచి బెయిల్ పై విడుదల
టీడీపీ అధినేత చంద్రబాబు అక్టోబరు 31న రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. తమ అధినేత విడుదల కావడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. 52 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబును చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. రాజమండ్రి నుంచి విజయవాడకు రావడానికి 14గంటల సమయం పట్టింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నపుడు కూడా బేగంపేట విమానాశ్రాయం నుంచి జూబ్లీహిల్స్ వరకు జనం ర్యాలీ నిర్వహించారు. నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. దాదాపు 2గంటల పాటు వివిధ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు సహా మరికొందరు టీడీపీ నేతలపై సీఐడీ కేసు పెట్టింది. గనుల శాఖ డైరెక్టర్, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టింది. చంద్రబాబు ఏ2 నిందితుడిగా, ఏ1గా అప్పటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత , ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమామహేశ్వరరావును నిందితులుగా చేర్చింది. నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఘాతుకం వంటి సెక్షన్ల కింద కేసు పెట్టింది.
స్కిల్ కేసులో జైలుకు చంద్రబాబు
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున 10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించారంటూ ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంత కాలంగా లోతుగా విచారిస్తున్న సీఐడీ పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది.