తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీపీఎం పార్టీ దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తులు బెడసి కొట్టడంతో ఒంటరిగా బరిలోకి దిగుతోంది. 14 మంది తొలి జాబితా ప్రకటించిన సీపీఎం నేతలు, మలి జాబితాలో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇద్దరు అభ్యర్థులతో రెండో జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి మల్లు లక్ష్మి, నల్గొండ నియోజకవర్గం నుంచి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.


సీపీఎంతో పొత్తుకు చివరి దాకా ప్రయత్నాలు


మరోవైపు సీపీఎంతో పొత్తు కొనసాగించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇప్పటికే కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి కేటాయించిన హస్తం పార్టీ,  మిర్యాలగూడ, వైరా స్థానాలను సీపీఎం కోసం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. సీట్ల కేటాయింపు విషయంలో ఆ రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. చివరి వరకు సీపీఎంతో పొత్తుకోసం ప్రయత్నిస్తామని కాంగ్రెస్‌ వెల్లడించారు. భద్రాచలం, పాలేరు, వైరా స్థానాలను ఇవ్వాలని అడిగితే కాంగ్రెస్‌ నిరాకరించిందని తమ్మినేని వీరభద్రం తెలిపారు. వైరా, మిర్యాలగూడ ఇస్తామని చెప్పిందని, ఆ తర్వాత వైరా కూడా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసిందన్నారు.


సీపీఐతో పొత్తు ఖాయం


ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు ఖాయమైనట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ పోటీ చేయబోతున్నట్లు చెప్పారు. ఆ స్థానంలో సీపీఐ విజయానికి కాంగ్రెస్‌ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అధిష్ఠానం ఆదేశాలతో హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి ఇస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌-సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్‌ రెడ్డి తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటించనున్నారు.


16 మందితో కాంగ్రెస్ రెండో జాబితా
సీపీఎంతో చివరిదాకా పొత్తులపై చర్చలు జరుపుతామన్న కాంగ్రెస్‌, 16 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. కామారెడ్డి నుంచి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ పోటీ చేయనున్నారు. బోథ్‌ అభ్యర్థి వెన్నెల అశోక్ స్థానంలో గజేందర్ సీటు కేటాయించగా, వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో తూడి మేఘారెడ్డిని బరిలోకి దించింది. చెన్నూర్‌- డా.జి వివేకానంద,  బోథ్‌ - గజేందర్‌, జుక్కల్‌ - తోట లక్ష్మీ కాంతారావు, బాన్సువాడ - ఏనుగు రవీందర్‌ రెడ్డి, కామారెడ్డి - రేవంత్‌ రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ - షబ్బీర్‌ అలీ, కరీంనగర్‌ - పురుమళ్ల శ్రీనివాస్‌, సిరిసిల్ల - కొండం కరుణ మహేందర్‌ రెడ్డి, నారాయణఖేడ్‌ - సురేష్‌ కుమార్‌ షెట్కర్‌, పటాన్‌చెరు - నీలం మధు ముదిరాజ్, వనపర్తి - తూడి మేఘా రెడ్డి, డోర్నకల్‌ - డా. రామచంద్రు నాయక్‌, ఇల్లెందు - కోరం కనకయ్య,    వైరా  - రామదాస్‌ మాలోత్‌, సత్తుపల్లి - మట్టా రాగమయి, అశ్వారావుపేట - జారె ఆదినారాయణకు సీట్లు కేటాయించింది.