Youth Died in an Accident in Konaseema: ఏపీలో ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో 8 మంది యువకులు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు, కడప జిల్లా పందిళ్లపల్లి వద్ద బైక్ ను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద మున్నేరు వాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ ను బైక్ ఢీకొని
అంబేడ్కర్ కోనసీమ జిల్లా యానాం జాతీయ రహదారిపై బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు ట్రాక్టర్ ను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయారు. బైక్ తో వేగంగా వస్తూ ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొనగా ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు తాళ్లరేవు మండలం రచ్చవారిపేటకు చెందిన ఓలేటి శ్రీను (28), ఓలేటి రాజు(26), ఎదుర్పంక గ్రామం రామాలయంపేటకు చెందిన పాలేపు ప్రసాద్ (24)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో రచ్చావారిపేటకు చెందిన రచ్చ శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. నలుగురూ కలిసి పెయింటింగ్ పనులు చేసుకుంటుండగా, ఒకే బైక్ పై వెళ్తూ ట్రాక్టరును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
లారీ ఢీకొని ఇద్దరు
అటు, వైఎస్ఆర్ జిల్లా కమలాపురం పందిళ్లపల్లి వద్ద బైక్ ను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా పొన్నలూరుకు చెందిన బింగి మహేశ్ (31), బింగి చిన్నమోహన్(29) నల్లలింగాయపల్లెలో తాపీమేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున పెట్రోల్ బంకు నుంచి ద్విచక్రవాహనంపై పెట్రోల్ తీసుకుని వెళ్తుండగా పందిళ్లపల్లి వద్ద కడప - తాడిపత్రి జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నీట మునిగి ముగ్గురు
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర వద్ద మున్నేరు వాగులో ఈతకు దిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సరదాగా ఈత కొట్టేందుకు వచ్చిన వీరు లోతు తెలియక నీటిలో మునిగిపోయారు. సమీపంలోని స్నేహితులు కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చి వారిని బయటకు తీశారు. అప్పటికే ముగ్గురు యువకులు మృతి చెందగా, మిగిలిన ఇద్దరిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులు ఐతవరం గ్రామానికి చెందిన చేజర్ల దినేశ్, యడవల్లి గణేష్, గాలి సంతోష్ కుమార్ గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ను ఈడ్చుకెళ్లిన లారీ
అటు, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఆదివారం రాత్రి ఓ బైక్ ను లారీ ఢీకొట్టింది. అనంతరం సుమారు 20 కి.మీ వరకు బైక్‌ను ఈడ్చుకెళ్లింది. కొంతమంది తమ బైక్ ను జాతీయ రహదారి పక్కన ఓ హోటల్ వద్ద నిలపగా, ఆ సమయంలో అటుగా వచ్చిన లారీ వేగంగా బైక్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. లారీని ఆపకపోవడంతో కొయ్యలగూడెం పోలీసులు అప్రమత్తమై తూ.గో జిల్లా దేవరాపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డైమండ్ జంక్షన్ వద్ద లారీని అడ్డగించిన పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బైక్ ను అలాగే తీసుకురావడంతో తుక్కు తుక్కుగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Andhra News : ఏపీలో రూ. 50 వేల కోట్ల ఇసుక దోపిడీ - కీలక విషయాలు వెల్లడించిన టీడీపీ నేత ఆనంద్ బాబు