Traffic Constable Attack on TDP MLA PA: టీడీపీ ఎమ్మెల్యే పీఏపై ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన రాజమహేంద్రవరంలో (Rajamahendravaram) గురువారం రాత్రి జరిగింది. రాజమండ్రికి చెందిన గోలుకొండ చంద్రశేఖర్ (Golukonda Chandrasekhar) ఎమ్మెల్యే పీఏగా పని చేస్తున్నారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఆయన ఎమ్మెల్యే ఇంటికి వెళ్తుండగా, అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కరుణ్ బాబు (Traffic Constable Karunbabu) అతన్ని అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా, చంద్రశేఖర్ బైక్ తాళం తీసుకున్న కానిస్టేబుల్ సెల్ ఫోన్ లో బండి నెంబరును ఫోటో తీశాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సెల్ ఫోన్ ను చంద్రశేఖర్ లాక్కొనేందుకు యత్నించగా అది రోడ్డుపై పడింది. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ తన చేతిలో ఉన్న వాకీటాకీతో చంద్రశేఖర్ పై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తాను నిబంధనలు పాటించినా కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడని బాధితుడు ఆరోపిస్తూ అక్కడే నిరసనకు దిగాడు.


ఎమ్మెల్యే బైఠాయింపు


విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘటనా స్థలానికి వెళ్లి తన పీఏకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. జనసేన పార్టీ ఉమ్మడి తూ.గో జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, తెలుగుదేశం కార్యకర్తలు అక్కడికి వెళ్లి కానిస్టేబుల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కూడలి వద్ద సిగ్నల్‌ పడినా ఆగకుండా చంద్రశేఖర్‌ రివర్స్ దిశలో వస్తుంటే తమ కానిస్టేబుల్‌ అడ్డుకుని ఫొటో తీశాడని, ఈ నేపథ్యంలో అతడు ఫోను లాక్కుని నేలకేసి కొట్టడంతో కానిస్టేబుల్‌ దాడి చేశాడని డీఎస్పీలు విజయ్‌పాల్‌, వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మాట్లాడిన పోలీసులు, ఈ ఘటనపై విచారించి కేసు నమోదు చేస్తామని చెప్పి బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు.


నారా లోకేశ్ ఆగ్రహం


రాష్ట్రంలో కొందరు పోలీసులు జగన్‌ రెడ్డి ప్రైవేటు సైన్యంలా మారారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పీఏ చంద్రశేఖర్‌పై ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


దొమ్మేరులోనూ ఉద్రిక్తత


అటు, తూ.గో జిల్లా కొవ్వూరు (Kovvuru) మండలం దొమ్మేరు (Domeeru)లో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లెక్సీ వివాదంలో పోలీసులు తనను వేధించారనే మనస్తాపంతో ఎస్సీ యువకుడు మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు హోం మంత్రి తానేటి వనిత (Thaneti Vanitha), సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున (Meruga Nagarjuna), కలెక్టర్, డీఐజీ గ్రామానికి రాగా, స్థానికులు, మృతుడి స్నేహితులు, కుటుంబ సభ్యులు వారిని అడ్డుకున్నారు. ఘటనకు స్థానిక వైసీపీ నేతలు, పోలీసులే కారణమని ఆరోపించారు. హోంమంత్రి బాధ్యత వహించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ గ్రామస్థులు తీవ్రంగా ప్రతిఘటించడంతో, దాదాపు అరగంట పాటు మంత్రులు గ్రామం వెలుపలే వేచి ఉండాల్సి వచ్చింది. గ్రామస్థులు, పోలీసుల మధ్య తోపులాట జరగ్గా, ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు రూ.20 లక్షలు అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఘటనకు బాధ్యులైన వారిపై విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Also Read: Andhra News: మంత్రులకు నిరసన సెగ - దళిత యువకుడి ఆత్మహత్యపై దొమ్మేరులో ఉద్రిక్తత