ఓ తండ్రి కుమార్తె మీద పలుసార్లు అత్యాచారం జరిపాడు. ఈ నేరం రుజువు కావడంతో హైదరాబాద్ (Hyderabad) లోని నాంపల్లి కోర్టు (Nampally Court ) సంచలన తీర్పు ఇచ్చింది. కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి 25 సంవత్సరాల (Twenty Five Years Prison) కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా 5వేల రూపాయల జరిమానా విధించింది. తల్లి ఇంట్లో లేని సమయంలో 11 ఏళ్ల కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు కడుపు నొప్పితో బాధపడుతుండటంతో తల్లి నిలదీసింది. దీంతో బాధితురాలు కన్నతల్లికి జరిగిన విషయాన్ని చెప్పింది. భర్త చేసిన దారుణంపై భార్య చాంద్రాయణగుట్ట  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై 376(2)(f)(n), 506 IPS r/w 6 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాధితురాలిని భరోసా సెంటర్‌కు తరలించిన పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేసి వైద్య ఆధారాలు సేకరించారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో నాంపల్లి కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.


అల్లూరి జిల్లాలోనూ...
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బౌడ గ్రామానికి చెందిన 14 ఏళ్ల  బాలిక, సమీపంలోని ఓ స్కూల్లో 8 వ తరగతి చదువుతుంది. అక్కడి హాస్టల్ లోనే ఉండేది. ఆమె తండ్రి కూలీ పనులు చేసేవాడు. నిత్యం భార్య, కూతురిని అనుమానిస్తూ తిడుతుండేవాడు. స్కూల్లో చదువుతున్న కుమార్తెను ప్రతివారం ఇంటికి తీసుకువచ్చి బెదిరించి అత్యాచారం చేసేవాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక భయపడి మౌనంగా ఉండిపోయింది. ఈ క్రమంలో 2019 సెప్టెంబర్ 3న హాస్టల్ నుంచి కుమార్తెను ఇంటికి తీసుకువచ్చాడు. కుటుంబ సభ్యులు అందరూ  బయటకు వెళ్లడంతో, ఇంట్లో ఎవరు లేకపోవడంతో  కూతురి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బయటికి వెళ్ళిన భార్య  ఏదో పని మీద  వెంటనే వెనక్కి రావడంతో  జరుగుతున్నఘోరాన్ని చూసి, షాక్ కు గురయింది. కుమార్తెను తీసుకుని చింతపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.


మధ్యప్రదేశ్ లోనూ ఇలాంటి ఘటనే
గతేడాది జూన్ లో తండ్రీకూతుళ్ల బంధానికి మచ్చతెచ్చే ఘటన మధ్యప్రదేశ్​లో చోటుచేసుకుంది. తండ్రి తన కన్నకూతురిపై పశువులా మీదపడి కోరిక తీర్చుకున్న అవమానకర ఘటన ఇండోర్​లో జరిగింది. 11ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే బాలికపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు నిందితుడు. సౌదీ అరేబియాలో ఓ పెట్రోలియం కంపెనీలో పనిచేసే అతడు.. రెండేళ్ల కోసారి ఇండోర్​కు వచ్చేవాడు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూతురిపై రేప్ చేసేవాడు. తండ్రి క్రూరత్వాన్ని భరించలేని ఆ చిన్నారి తల్లి సాయంతో పోలీసులను ఆశ్రయించింది.


చిన్నప్పటి నుంచి తన తండ్రి అసభ్యంగా ప్రవర్తించేవాడని బాధితురాలు గోడు వినిపించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బొమ్మలు, చాక్లెట్ల ఆశ చూపించి, రహస్య భాగాలను తాకేవాడని తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడని వెల్లడించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడల్లా అత్యాచారం చేసేవాడని చెప్పింది. చివరకు, ఈ విషయం తల్లికి చెప్పింది బాధితురాలు. మొదట దీని గురించి ఆమె నమ్మలేదు. అయితే, కూతురు గట్టిగా చెప్పేసరికి తల్లి విశ్వసించింది. కూతురిని వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్​కు వెళ్లింది. నిందితుడిపై ఫిర్యాదు చేయగా, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.