ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం 958 హాళ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. లెక్కింపునకు 609 మంది అధికారులు, 1047 మంది సహాయ ఎన్నికల అధికారులు, 11,227 మంది పర్యవేక్షకులు, 31,133 మంది సహాయ పర్యవేక్షకులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమించారు. మూడు రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి. మధ్నాహ్నానికి ఎంపీటీసీ ఫలితాలు, రాత్రికి జడ్పీటీసీ ఫలితాలు కొలిక్కి రానున్నాయి. ఉద్రిక్తతలు తలెత్తకుండా అన్ని కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటుచేశారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కరోనా నిబంధనలు పాటించాలని ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఆదేశించారు. 


ఎన్నికలకు దూరంగా టీడీపీ


రాష్ట్రంలో మొత్తం 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాల రీత్యా ఎన్నికల ప్రక్రియ 375 స్థానాల్లో నిలిచిపోయింది. కాగా పోటీ చేసిన వారిలో 81 మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 7,220 స్థానాలకుగాను 18,782 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఏప్రిల్‌ 8వ తేదీన ఆయా స్థానాలకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్  పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు.


జిల్లాల వారీగా..


గుంటూరు : 45 జడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌


కృష్ణా: 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌


విశాఖపట్నం: 37 జడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌


తూర్పు గోదావరి: 61 జడ్పీటీసీ, 996 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌


పశ్చిమ గోదావరి: 45 జడ్పీటీసీ, 781 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌


నెల్లూరు: 34 జడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌


చిత్తూరు: 33 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌


కడప: 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌


కర్నూలు: 36 జడ్పీటీసీ,  484 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌


అనంతపురం: 62 జడ్పీటీసీ, 781 స్థానాలకు కౌంటింగ్‌


ప్రకాశం: 41 జడ్పీటీసీ, 368 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌


శ్రీకాకుళం:  37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌


విజయనగరం: 31 జడ్పీటీసీ, 487 ఎంపీటీసీ  స్థానాలకు కౌంటింగ్‌


బ్యాలెట్ పేపర్లకు చెదలు... బాక్స్ ల్లో నీరు


విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో 47 బ్యాలెట్ ఓట్లు రద్దైయ్యాయి. డిక్లరేషన్‌ ఫారం లేకపోవడంతో ఈ బ్యాలెట్లను అధికారులు రద్దు చేశారు. విశాఖ జిల్లా గోలుగొండ మండలం పాకలపాడు, ఎల్లవరం కేంద్రాల్లో వర్షపు నీరు చేరింది. రెండు కేంద్రాల్లో బ్యాలెట్‌ పత్రాలు తడవడంతో సిబ్బంది ఆరబెడుతున్నారు. మాకవరపాలెంలో మూడు బ్యాలెట్ బ్యాకుల్లో నీరు చేరింది. గుంటూరు లూథరన్ బి.ఎడ్. కళాశాల కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు తడిచిపోయాయి. తాడికొండ మండలం బేజాతపురం, రావెల బ్యాలెట్ బాక్సులు తడిచినట్లు సిబ్బంది గుర్తించారు. బాక్సుల్లో నుంచి బ్యాలెట్లు బయటకు తీసి ఆరబెడుతున్నారు. ఆమదాలవలసలో జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్లకు చెద పట్టింది. ఈ విషయాన్ని కౌంటింగ్ సిబ్బంది అధికారులు తెలిపారు. ఈ ఘటన విచారణ చేపట్టారు.  అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనహల్లి బ్యాలెట్‌ బాక్సుకు చెదలు పట్టాయి. బ్యాలెట్‌ పత్రాలకు చెదలు పట్టడంతో కౌంటింగ్‌ అధికారులు కలెక్టర్ కు సమాచారం అందించారు. 


ఎటపాక డివిజన్ మధ్నాహ్నానికే ఫలితం
 
తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హరికిరణ్ పర్యవేక్షించారు. జిల్లాలో 996 ఎంపీటీసీ స్థానాలకు, 61 జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. జిల్లాలోని 61 మండలాలకు ఏడు డివిజన్ల పరిధిలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రామచంద్రపురం, రంపచోడవరం, ఎటపాక, పెద్దాపురం  ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 12 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ కోసం 303 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఎటపాక డివిజన్ ఫలితాలు మధ్నాహ్నానికి వెల్లడయ్యే అవకాశం ఉంది. 


Also Read: ZPTC MPTC Results Live Updates: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు