Andhra Pradesh Ward and Village Volunteers Strike News: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ సమ్మె చేస్తోందని వచ్చిన వార్తలను వాలంటీర్ల సంఘం ఖండించింది. తాము సమ్మె చేయడం లేదని ఓ ప్రకటనలో తెలిపింది. కొనని పత్రికలు, ఛానెళ్లు, సోషల్ మీడియాలో జరుగుతన్న ప్రచారాన్ని తప్పుపట్టింది. 


ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు చేయడం లేదని వార్డు, గ్రామ సచివాలయ వాలంటీర్ల సంఘం తేల్చి చెప్పింది. ఇప్పుడు జరుగుతున్నదంతా ఫేక్ ప్రచారమని కొట్టిపారేసింది. సీఎం జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవస్థతో జరుగుతున్న మంచిని జీర్ణించుకోలేక కొందరు చేస్తున్న దుష్ప్రచారంగా అభిప్రాయపడ్డారు. 


వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నారని, విధులు బహిష్కరిస్తున్నారని వస్తున్న వార్తలు నిరాధారమైనవని సంఘం తెలిపింది. అధిక పని భారాన్ని మోస్తున్న వాలంటీర్ల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. వాటిని త్వరలో పరిష్కరిస్తామని, వాలంటీర్లను ఉన్నత స్థాయిలో నిలబెట్టే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. 


అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు వేల మందికిపైగా వాలంటీర్లకు ఉగాది పురస్కారాలు అందలేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సాంకేతిక కారణాల దృష్ట్యా నగదు జమ కాలేదని త్వరలో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీఇచ్చినట్లు సంఘం తెలిపింది. సమ్మె బాట పట్టిన వాలంటీర్స్ అని, జగన్‌తో వాలంటీర్స్ యుద్ధం అని వస్తున్న వార్తలు, దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు వాలంటీర్ల సంఘం ప్రకటించింది.