Breaking News Live: 4వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 05 Feb 2022 06:21 PM
4వ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. 4వ తరగతి విద్యార్ధిని పై అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడు. ఛత్రినక పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగమ్మెట్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాల 4వ తరగతి అమ్మాయిపై ఉపాధ్యాయుడు అశ్వక్( 35) లైంగిక దాడి చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుడు అశ్వక్( 35) ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఏపీలో ఎస్మా ప్రయోగం.. ముందుగా మైనింగ్ శాఖలో ఉత్తర్వులు జారీ

ఉద్యోగులు సమ్మెకు వెళుతున్న క్రమంలో ఏపీలో ఎస్మా ప్రయోగిస్తున్నారు. ఈ మేరకు ముందుగా మైనింగ్ శాఖలో ఉత్తర్వులు జారీ అయ్యాయి.


ఎస్మా అంటే ? 
ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటేనెన్స్‌ యాక్ట్‌ అంటే అత్యవసర సేవల నిర్వహణ చట్టాన్ని ఎస్మా అంటారు.  సమ్మెలు, బంద్‌ల వల్ల ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా చూడటం, కొన్ని రకాల అత్యవసర సేవల ని ర్వహణ ఆటంకం లేకుండా కొనసాగేలా చూడటం కోసం ఈ చట్టం రూపొందించారు. 1981లో దీన్ని రూపొందించి చట్ట రూపమిచ్చారు.

కశ్మీర్‌లో స్వల్ప భూకంపం

ఉత్తరాదిలో కశ్మీర్, నోయిడా సహా ఇతర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్​ స్కేలుపై దీని తీవ్రత 5.7 గా నమోదైంది. ఆస్తి, ప్రాణనష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో కూడా 3.6 తీవ్రతతో భూమి కంపించినట్లు తెలిపారు. అఫ్గానిస్థాన్​- తజికిస్థాన్​సరిహద్దులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉదయం 9.45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్​ సెంటర్​ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు శ్రీనగర్​ మేయర్ ​జునైద్​ అజీమ్ ​ట్వీట్​ చేశారు.

వసంతపంచమి సందర్భంగా బాసరలో భక్తుల రద్దీ

నిజామాబాద్ సమీపంలోని నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వసంత పంచమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి అమ్మవారి సన్నిధిలో తమ పిల్లలకు భారీగా అక్షరాభ్యాసం పూజలు నిర్వహిస్తున్నారు.

షేక్ పేట ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం

షేక్‌పేట మీదుగా వెళ్లే కొత్త ఫ్లై ఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ పై వేగంగా వచ్చిన కారు.. బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ఫ్లై ఓవర్‌పై నుంచి ఎగిరి కిందపడిన యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది.

బాలికపై పాస్టర్ అత్యాచారయత్నం

ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన బాలికపై పాస్టర్ గోద తిరుపతి అనే 42 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు బాలికను అతని బారి నుంచి కాపాడారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన పాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కర్ణాటక గవర్నర్ తవర్ చంద్ గేహలోట్, ఏపీ విప్ పిన్నెలి రామకృష్ణ రెడ్డి, పాండిచ్చేరి మంత్రి లక్ష్మీ నారాయణ, అల్లు ఆర్జున్ సతీమణి స్నేహరెడ్డి వేర్వేరుగా కుటుంబ సభ్యులతో  కలసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం వేదపండితులు వీరికి వేద ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో కర్ణాటక గవర్నర్ తవర్ చంద్ గేహలోట్ మాట్లాడుతూ... స్వామి వారిని దర్శించుకోవడం చాలా అనందంగా ఉందన్నారు. దేశం శాంతి, అభివృద్ధి పథంలో నడవాలని, అందుకు స్వామి వారి ఆశీస్సులు నిండుగా ఉండాలి కోరుకున్నట్లు తెలిపారు.

జంగారెడ్డి మరణం పట్ల కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంతాపం

మాజీ పార్లమెంట్ సభ్యుడు చందుపట్ల జంగారెడ్డి మృతిపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు మార్గదర్శకులు జంగారెడ్డి మరణం పార్టీకి తీరని లోటని వారు అన్నారు. వారి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతిని తెలియజేశారు.

బీజేపీ సీనియర్ నేత కన్నుమూత

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న జంగా రెడ్డి చనిపోయారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు. వరంగల్ జిల్లాలో చందుపట్ల జంగారెడ్డి 18 నవంబర్ 1935 న జన్మించారు. ప్రస్తుతం హన్మకొండలో నివాసం ఉంటున్నారు. సుదేష్మాను 1953లో వివాహం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఈ ఎన్నికల్లో వాజ్ పేయీ, అడ్వాణీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయినా జంగా రెడ్డి విజయం సాధించారు.

కరెంటు స్తంభాన్ని ఢీకొన్న బైక్.. ముగ్గురు విద్యార్థులు మృతి

గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కరెంటు స్తంభాన్ని బైక్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మృతులను పెనుమాక వాసులుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Background

ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో నేడు నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.


‘‘అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. అత్యల్పంగా అనంతపురం జిల్లా మడకశిరలో 12.2 డిగ్రీలు నమోదయ్యింది. కర్ణాటక కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మరో వైపున పొగ మంచు తిరుపతి, చిత్తూరు జిల్లా తూర్పు భాగాలు, నెల్లూరు జిల్లా దక్షిణ భాగాల్లోకి విస్తరిస్తోంది. గోదావరి జిల్లా భీమవరం పరిశరాల్లో కూడ పొగ మంచు విస్తరిస్తోంది. నగరాల వారీగా కర్నూలులో అత్యల్పంగా 15.3 డిగ్రీలు నమోదయ్యింది. చలి తీవ్రత గత వారంతో పోలిస్తే తక్కువగానే ఉంది. మళ్లీ ఈ రోజు మధ్యాహ్నం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎండ, కాస్త వేడిగా ఉంటుంది.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.


తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. కానీ, రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.


హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. వాయువ్య దిశ ఉపరితల గాలులు గంటకు 6 కిలో మీటర్ల నుంచి 8 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంటుంది. ముందు రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.4 డిగ్రీలుగా నమోదైంది. 


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. వెండి ధర గ్రాముకు రూ.0.50 పైసలు తగ్గి కిలోకు రూ.500 దిగి వచ్చింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.65,100గా నిలకడగానే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,100గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.