YS Jagan Visits Vallabhaneni Vamsi At Vijayawada Sub Jail | అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) విజయవాడలో పర్యటిస్తున్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని వైఎస్ జగన్ పరామర్శించారు. అక్రమ కేసులపై పోరాటం చేద్దామని, పార్టీ నేతల అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని వంశీకి ధైర్యం చెప్పాడు. జైలు వద్దకు కొడాలి నానితో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.


కాగా, విజయవాడ సబ్ జైలుకు మాజీ సీఎం వస్తున్న సందర్భంగా అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ తమ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఏపీలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వైసీపీ నేతల అరెస్టులపై సోషల్ మీడియా, ఐటి టీమ్ ప్రతినిధులతో తదుపరి కార్యాచరణ పై చర్చించనున్నారని తెలుస్తోంది. 


కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు నోటీసులు


విజయవాడ: వంశీ బెయిల్ పిటిషన్‍పై పోలీసులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. వల్లభనేని వంశీ అరెస్టు కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశించింది. కస్టడీ పిటిషన్‍పై కౌంటర్ దాఖలు చేయాలని వంశీ లాయర్లను సైతం జడ్జి ఆదేశించారు. దాంతో ఇరువర్గాలు ఈ కేసులో కౌంటర్లు దాఖలు చేయనున్నాయి.



జగన్ పరామర్శలపై సత్యకుమార్ పంచ్‌లు!
వైసీపీ అధినేత జగన్‌ కేవలం అరెస్టైన పార్టీ నేతల పరామర్శలకు పరిమితం అయ్యారని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. గుంటూరు, నెల్లూరు, విజయవాడ.. ఇలా ఒక్కో జైలుకు వెళ్లిన వారిని పరామర్శించడమే అతని పనిగా మారింది. దాంతో మాజీ సీఎంకు అభివృద్ధి ఎలా జరుగుతోందో వచ్చి చూస్తే తెలుస్తుందని సూచించారు.  


వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్
గన్నవరం టిడిపి ఆఫీసు ధ్వంసం కేసులో పిటిషనర్ అయిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయడం, దాడి సహా అట్రాసిటీ కేసులలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వచ్చి వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించడం తెలిసిందే. ఆపై వల్లభనేని వంశీతో పాటు A7 శివ రామకృష్ణ, A8 నిమ్మా లక్ష్మీపతిలను విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. మేజిస్ట్రేట్ వారికి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. విజయవాడ తీసుకువచ్చిన పోలీసులు దాదాపు 8 గంటలపైగా విచారించిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరిచారు. వంశీ సహా ముగ్గురు నిందితులకు రెండు వారాలపాటు రిమాండ్ విధించారు.


Also Read: Andhra Politics: నార్త్ కి లోకేష్, సౌత్ కి పవన్ కళ్యాణ్... అసలేంటి ఈ నేతల ప్లాన్