ఏపీలో కరోనా కేసులు(Corona Cases) భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 14,249 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 182 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,714కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 950 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,95,768 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 5,985 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,16,467కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,29,91,889 నిర్థారణ పరీక్షలు చేశారు.
12-18 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా
12-18 ఏళ్ల పిల్లలకు మరో టీకా అందుబాటులోకి వచ్చింది. బయోలాజికల్-ఇ సంస్థకు చెందిన కార్బెవాక్స్ వ్యాక్సిన్ అత్యవసర అనుమతికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తుది అనుమతులు ఇచ్చింది. రెండు డోసుల కింద పంపిణీ చేసే ఈ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. 12-18 ఏళ్ల పిల్లల వ్యాక్సినేషన్‌కు అందుబాటులోకి వచ్చిన రెండో టీకాగా కార్బెవాక్స్ రికార్డులకెక్కింది. బయోలాజికల్-ఇ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్ టీకా 5 కోట్ల డోసుల కోసం ఆ సంస్థకు ఇటీవల కేంద్రం ఆర్డర్ పెట్టింది. ఒక్కో డోసును రూ. 145(జీఎస్‌టీ అదనం) చొప్పున వీటిని కొనుగోలు చేయనుంది. ఈ డోసులను ఫిబ్రవరి చివరి నాటికి సంస్థ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది.