Polavaram Project Latest News: ఏపీలో ప్రజల జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు గురించి ఒడిశా అసెంబ్లీలో రచ్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. పోలవరం వల్ల తమ రాష్ట్రంలోని మల్కన్ గిరి జిల్లాలోని దిగువ ప్రాంతాలు, అటవీ గిరిజన ప్రాంతాలు కొన్ని ముంపునకు గురవుతాయని ఒడిశా నేతలు ఆరోపిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ కూడా ఇదే రకమైన ఆందోళన వ్యక్తం చేస్తోంది. 


అయితే, ఒడిశా అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత రామచంద్ర కాదమ్ జీరో అవర్ లో ఈ అంశాన్ని లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బాగా ప్రాధాన్యం ఇస్తుండడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ ప్రాజెక్టు కారణంగా ఒడిశాలోని మల్కన్ గరి జిల్లాలో దాదాపు 1400 హెక్టార్ల నుంచి 1500 హెక్టార్ల దాకా భూమి ముంపునకు గురవుతుందని చెప్పారు. తద్వారా అక్కడి నిరుపేదలైన గిరిజనులు పోలవరం వల్ల బాధితులు అవుతున్నారని అన్నారు. ఒడిశాలో ప్రభావితం కానున్న ముంపు ప్రాంత సమస్యను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును సొంతంగా ప్రమోట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. 


గిరిజనుల సమస్యే కాదు పోలవరం ప్రాజెక్టు వల్ల అటవీ ప్రాంతం, వన్యప్రాణులు, పర్యావరణం కూడా ఎంతో ప్రభావితం అవుతుంది. ఒడిశా నుంచి 20 మంది బీజేపీ ఎంపీలు ఎన్నిక కాగా, వారు మల్కన్ గిరి జిల్లాలోని ప్రజలను పట్టించుకోవడం లేదు’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నారు.