President Droupadi Murmu AP Tour: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం పుట్టపర్తికి చేరుకోనున్న రాష్ట్రపతి ముర్ము... పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒడిశా నుంచి మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 2గంటల 45నిమిషాలకు ప్రశాంతి నిలయం చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు సాయికుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సత్యసాయి సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.
సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా స్నాతకోత్సవం వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 3గంటల 35నిమిషాలకు స్నాతకోత్సవంలో భాగంగా 14 మందికి డాక్టరేట్లు, 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు ద్రౌపది ముర్ము. ఆ తర్వాత స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నరు అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు.
ప్రతి సంవత్సరం సత్యసాయి బాబా పుట్టినరోజుకు ఒక రోజు ముందు... ఈ స్నాతకోత్సవం నిర్వహిస్తారు. రేపు సత్యసాయి 98వ జయంతి. కనుక ఇవాళ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తుండటంతో.. భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు తెలిపారు.
పర్యపర్తి పర్యటన ముగించుకుని సాయంత్రం 4గంటల 20నిమిషాలకు రోడ్డు మార్గంలో సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోతారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పుట్టపర్తిలో భారీ ఏర్పాట్లు చేశారు అధికారలు. 2 వేల మందితో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.