మహిళలపై దాడులు జరిగితే దిశ యాప్ లో ఫిర్యాదు చేయాలని వైసీపీ ప్రభుత్వం చెబుతోందని ఎంపీ రఘురామ కృష్ణరాజు గుర్తుచేశారు. అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఘటనలపై దిశ యాప్ లో ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఎమ్మె్ల్యేలు దుర్భాషలు మాట్లాడితే అదుపుచేయాల్సిన సీఎం.. వాటిని నియంత్రించకుండా చిరునవ్వులు చిందించారని ఆరోపించారు. సభాపతి తీరు కూడా దురదృష్టమన్నారు. వైసీపీ నేతలు తీరు మార్చుకోవాలని ఎంపీ రఘురామ సూచించారు. 'మీ ఇంట్లోనూ తల్లి, ఆడకూతుళ్లు ఉంటారు కదా. ఇదే అసెంబ్లీ మీ కుటుంబ సభ్యుల గురించి అసభ్యంగా మాట్లాడితే తట్టుకోగలరా. మీకు బీపీ పెరిగితే డీజీపీ ముందుండి సపోర్ట్ చేస్తారు' అని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఫిర్యాదు చేయండి
చంద్రబాబు కుటుంబ సభ్యులకు జరిగిన అవమానంతో విజయకృష్ణ అనే కానిస్టేబుల్ రాజీనామా చేశారని రఘురామ అన్నారు. అతనికి సెల్యూట్ చేయాలన్నారు. ఇతన్ని చూసి మిగతా పోలీసులు నేర్చుకోవాలన్నారు. కానిస్టేబుల్ ఈ ప్రభుత్వ విధానాలతో ఇమడలేక రాజీనామా చేశారన్నారు. అసెంబ్లీలో జరిగిన ఘటనలు ఏదో ఒక ఫ్యామిలీ ఇష్యూ కాదన్నారు. ఎన్టీ రామారావు తెలుగు జాతి సంపద అన్న ఆయన.. ఎన్టీఆర్ లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎవరూ లేరన్నారు. అటువంటి ఎన్టీఆర్ కుమార్తెను కొందరు నిండు సభలో దుర్భాషలడడం చాలా దురదృష్టకరమన్నారు. ఇది తెలుగు జాతి పరువుకు సంబంధించిందన్నారు. ఎన్టీఆర్ కుమార్తెకు జరిగిన అవమానాన్ని తెలుగు జాతి మొత్తం ఖండించాలన్నారు. సభలో జరిగిన ఘటనలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు దిశ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. ఐపీసీ 354, 504, 153(ఎ) మూడు సెక్షన్లపై కేసులు పెట్టాలన్నారు. సామాజిక మధ్యమాల్లో ఈ విషయంపై స్పందించాలన్నారు.
వివేకా హత్య కేసును పక్కదారి పట్టించడానికే
ఏపీ శాసనసభలో జరిగిన ఘటనలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. చంద్రబాబు సతీమణికి జరిగిన అవమానం భూదేవికి జరిగినట్లేనని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనతో ఎన్టీఆర్ కుటుంబం చాలా ఆవేదన చెందుతున్నారో చూశామన్నారు. అసెంబ్లీలో జరిగిన ఘటన ఎన్టీఆర్ కుటుంబ సమస్య ఒక్కటే కాదన్న రఘురామ కృష్ణ రాజు తెలుగుజాతికి జరిగిన అవమానమన్నారు. విమర్శలు చేసిన వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను తెలుగు జాతి కుటుంబ పెద్దగా భావించాలన్నారు. మహిళలంతా ఏకమై ముందుకు రావాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు పిలుపునిచ్చారు. అన్ని రోజులన్నీ ఒకేలా ఉండవన్నారు. వివేకా హత్యపై మాట్లాడకుండా పక్కదారి పట్టించడానికే ఇదంతా చేస్తున్నారన్నారు.
Also Read: పవిత్రమైన అసెంబ్లీలో ఎన్టీఆర్ కుమార్తెపై దారుణమైన మాటలా ? ఇక సహించబోమన్న నందమూరి కుటుంబం !