మైకు ఉంటే చాలు, చూపించే టీవీలు ఉంటే చాలు.. అన్నట్టుగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని 2016లో జీవో జారీ చేశానని చంద్రబాబు చెబుతున్నారు.... అప్పుడు ఆ జీవో ఎందుకు జారీ చేశాడో అందరికీ తెలుసన్నారు. కాల్ మనీ రాకెట్ లో టీడీపీ నేతలు పేద కుటుంబాలను హింసించారని ఆరోపించారు. ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అంబేడ్కర్ కు 125 అడుగుల విగ్రహమని డైవర్షన్ ప్లాన్ ను అమలు చేశారని ఆరోపించారు. 2016లో జీవో జారీ చేసిన టీడీపీ ప్రభుత్వం ఆ తర్వాత మూడేళ్లు అధికారంలో ఉన్నా విగ్రహం ఎందుకు నిర్మించలేదన్నారు. 


రాజ్యాంగాన్ని అమలు చేయలేదు కాబట్టే ఈ పరిస్థితి


రాజ్యాంగాన్ని అమలు చేసేవారు సరైన వాళ్లు కాకపోతే వ్యవస్థ భ్రష్టుపట్టి పోతుందని, అనర్థాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్న మాటలకు ఆయనే లైవ్ ఎగ్జాంపుల్ అని బొత్స ఆరోపించారు.  రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయలేదు కాబట్టే ప్రజలు టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పరిధిలోనే టీడీపీ పాలన చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని ఏకంగా వారిని మంత్రుల్ని చేశారని ఆరోపణలు చేశారు. అందుకే ప్రజలు చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసి, దేశ రాజకీయాల్లోనే ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది టీడీపీ అని విమర్శించారు. 


Also Read: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ



'విజయనగరం వ్యక్తుల గురించి, మా భాష, సంస్కృతి గురించి విమర్శలు చేస్తున్నారు. మీ మాదిరిగా మోసం, దగా, వంచనతో మేము రాజకీయాలు చేయం. మా సంప్రదాయం, సంస్కృతి ఏంటంటే... ఎదుటి వారిని గౌరవించడం, నమ్మకంగా మెలగడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే మాకు తెలుసు. మీరు పెద్ద మేధావి. మీరు చెప్పింది ప్రజలకు అర్థం కాదు అని అనుకోవడంలో, నర్మగర్భంగా మాట్లాడటంలో మీరు ఆస్కార్ అవార్డు గ్రహీత. మేము చెప్పింది ప్రజలకు అర్థం అవుతుంది కాబట్టే, మా నిజాయితీని ఏనాడూ శంకించరు.' అని బొత్స సత్యనారాయణ అన్నారు.  


Also Read: రేపటి నుంచి ఉద్యమకార్యాచరణకు సిద్ధం... నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం


ఓటీఎస్ బలవంతంగా రుద్దే కార్యక్రమం కాదు


జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంటు)తో పేదలకు సంపూర్ణ హక్కులతో వారి పేర్ల మీద పక్కా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా సంతబొమ్మాళిలో పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సర్క్యులర్ కు సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. ఓటీఎస్ అనేది ఎవరి మీదా బలవంతంగా రుద్దే కార్యక్రమం కాదని బొత్స తెలిపారు. ఎవరైతే స్వచ్ఛందంగా ముందుకు వస్తారో అటువంటి వారికి వారు ఉండే ఇళ్లు సొంతం అవుతుందన్నారు. ఎప్పటి నుంచో ఆ ఇళ్ల మీద రుణాలు ఉన్నా నామమాత్రం రుసుములతో గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 15 వేలు, కార్పొరేషన్ ప్రాంతంలో రూ. 20 వేలతో ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పట్టా ఇస్తున్నామన్నారు. ఇందులో ఎవరైనా అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేదవాడికి సొంత ఇళ్లు ఇవ్వాలన్నదే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశమని గుర్తుచేశారు.


Also Read:  ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ... ఉద్యోగులు తలచుకుంచే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు... వైరల్ అవుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడి వీడియో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి