AP Fake Lawyers : ఏపీలో నల్లకోటు మాటున నకిలీలు చలామణీ అవుతున్నారు. తప్పుడు సర్టిఫికెట్లతో కొందరు న్యాయవాదులగా కొనసాగుతున్నారు. కనీసం చట్టంపై అవగాహన లేకుండానే కోర్టుల్లో వాదిస్తామని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో లాయర్లుగా మారి కోర్టులనే మోసం చేస్తున్నారు. బార్ కౌన్సిల్, ఇతర కోర్టులకు నకిలీల న్యాయవాదులపై ఫిర్యాదులు వచ్చినా స్పందన లేకపోవడంతో న్యాయ వ్యవస్థలో నకిలీల బెడద మరింత ఎక్కువైంది. ఇటీవల ఓ కేసు విషయంలో కోర్టులో నకిలీ న్యాయవాది వాదనలు వినిపిస్తుండగా మేజిస్ట్రేట్‌కు అనుమానం వచ్చింది. అతడి విద్యార్హత, న్యాయవాదిగా బార్ కౌన్సిల్ లో నమోదైన వివరాలు అడగడంతో అసలు విషయం బయటపడింది. నకిలీ లాయర్లపై వరుసగా వస్తున్న ఫిర్యాదులతో బార్ కౌన్సిల్ చర్యలు చేపట్టింది. ఫిర్యాదులు వచ్చిన లాయర్ల సర్టిఫికెట్లను పరిశీలించింది. ఆయా కళాశాలు, యూనివర్సిటీలకు బార్ కౌన్సిల్ లేఖలు రాసింది. అలా అందిన సమాచారంతో నకిలీ సర్టిఫికెట్లను గుర్తుచేసింది. మొత్తం 15 మంది ఫేక్ లాయర్లను గుర్తించింది. విచారణ అనంతరం 8 మంది న్యాయవాదులు తమ ఎన్‌రోల్‌మెంట్‌ను సరెండర్ చేశారు. మరో ఏడుగురిపై బార్ కౌన్సిల్ సెక్రటరీ తుళ్లూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న నిందితులపై ఐపీసీ 120B, 420, 467, 468, 471 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
యూనివర్సిటీలకు లేఖలు
ఈ కేసులో తుళ్లూరు పోలీసులు విచారణ చేపట్టారు. ఆయా విశ్వవిద్యాలయాలకు లేఖలు రాశారు. లాయర్లగా పేరు నమోదు చేసుకున్నప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం, బిహార్‌లోని బోధ్ గయ వర్సిటీ, అస్సాంలోని డిబ్రూగఢ్ వర్సిటీ, యూపీలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌ఎం, న్యాయవాది కోర్సులు చదివినట్లు లాయర్లు బార్ కౌన్సిల్‌కు సర్టిఫికెట్లు అందజేశారు. పోలీసులు, బార్ కౌన్సిల్ విచారణ వీళ్లు ఆయా విశ్వవిద్యాలయాల్లో చదవలేదని తేలింది. ఫిర్యాదులు వచ్చిన న్యాయవాదులు ఆయా వర్సిటీల్లో చదివారా లేదా అధికారికంగా తెలియజేయాలని ఆయా విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు లేఖలు రాశామని తుళ్లూరు డీఎస్పీ పోతురాజు చెప్పారు. నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా చలామణీ అవుతున్న నిందితులపై మోసం, ఫోర్జరీ, కుట్ర, నకిలీ పత్రాలు సృష్టించటం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించామన్నారు. బాధ్యులను త్వరలోనే అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడతామన్నారు. నిందితులపై నమోదైనవి తీవ్రమైన సెక్షన్లు కావడంతో వాళ్లంతా కచ్చితంగా జైలుకు వెళతారని డీఎస్పీ స్పష్టం చేశారు.
నకిలీ సర్టిఫికెట్లతో లాయర్లగా నమోదు
కాకినాడ జిల్లా తునిలో న్యాయవాదిగా 2011 ఆగస్టు 25న ఎన్‌రోల్ అయిన చింతకాయల మూర్తి, తెనాలి బార్ అసోసియేషన్ లో 2011 ఏప్రిల్ 15న చాముండేశ్వరి, 2017 డిసెంబరు 27న అనంతపురం బార్‌లో సీడీ పురుషోత్తం, 2019 ఏప్రిల్ 17న ఏపీ హైకోర్టులో ఎన్‌రోల్ అయిన డి.రత్నకుమారిని పోలీసులు నకిలీ న్యాయవాదులుగా తేల్చి వారిపై కేసులు నమోదు చేశారు. అలాగే సత్తెనపల్లి బార్‌లో లాయర్లుగా కొనసాగుతున్న బిక్కి నాగేశ్వరరావు, మాచర్ల వెంకటేశ్వరరావు, కాకినాడలో న్యాయవాదిగా కొనసాగుతున్న కొత్తూరి శ్రీనివాస వరప్రసాద్ అనే ముగ్గురు లాయర్లపై తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేశారు. కేసుల్లో విజయం సాధిస్తామని పలువురు కక్షిదారులను నకిలీ లాయర్లు పెద్ద మొత్తంలో మోసం చేసినట్లు తెలుస్తోంది. పలు జిల్లాల్లో ఇదే తరహాలో చాలా మంది నకిలీ లాయర్లు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొంత మంది నకిలీ సర్టిఫికెట్లతో, మరికొందరు దూరవిద్యలో సర్టిఫికెట్లు పొంది కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై న్యాయాధికారులు స్పందించి నకిలీ లాయర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని న్యాయవాదులు కోరుతున్నారు.