ఏపీ సిఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున తెలంగాణ సిఎం కెసిఆర్ కనిపించడమే కాదు దగ్గరుండి మరీ అన్నీ తానై చూసుకున్నారు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు వీరిద్దరూ కలిశారు. కానీ కృష్ణా జలాలు, పోతిరెడ్డిపాడు వివాదాలతో ఈ సిఎంలు దూరమయ్యారు. ఎవరికి వారే అన్నట్లు వ్యవహారించారు. అయితే ఇప్పుడు వీళ్లిద్దరు మళ్లీ కలిసి కనిపించే ఛాన్స్ ఉందా ? అంటే అవునన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల సిఎంలు విశాఖకి రాబోతున్నారట. విశాఖ శారదాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సిఎం జగన్ కి ఆహ్వానం అందింది. దీంతో ఆయన ఈ నెల 28న శారదాపీఠంకి వెళ్లనున్నారని తెలుస్తోంది. అంతే కాదు రాజశ్యామల యాగంలో కూడా పాల్గొనబోతున్నారట.
ఎన్నికల తరవాత వరుసగా భేటీ - తర్వాత కలవని సీఎంలు
2019 ఎన్నికలకు ముందు జగన్ ఈ యాగం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి రావడం పలుసార్లు శారదాపీఠంకి వెళ్లడం స్వామి ఆశీస్సులు తీసుకోవడం తెలిసిందే. జగన్ కి ఈ యాగం చేయమని కెసిఆరే సలహా ఇచ్చారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. శారదా పీఠం ఆహ్వానం తెలంగాణ సిఎం కెసిఆర్ కి కూడా అందిందని బీఆర్ ఎస్ ఏపీ నేతలు చెబుతున్నారు. ఏ రోజు వస్తారన్న దానిపై స్పష్టత లేకపోయినా తప్పకుండా మాత్రం ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని తెలిపారు. అయితే ఒకే రోజు ఇద్దరు సిఎంలు విశాఖకి వస్తే భద్రత కల్పించడం కష్టం కాబట్టి నెలాఖరున వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
విశాఖలో కేసీఆర్, జగన్ చర్చలు జరిపే అవకాశం
ఇప్పటికే పలుమార్లు కెసిఆర్ రాజశ్యామల యాగం చేశారు. ఎన్నికల సమయంలోనే కాదు ఢిల్లీలో బీఆర్ ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం రోజున కూడా ఈ యాగం చేశారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఏపీ బీఆర్ ఎస్ నేతలు. త్వరలో విశాఖలో బీఆర్ ఎస్ సభ ఉంటుందన్న ఆపార్టీ నేతలు ఎప్పుడన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు విశాఖకి రానున్న తెలంగాణ సిఎంకి జగన్ స్వాగతం పలుకుతారా లేదంటే వ్యక్తిగత పర్యటనగా భావిస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఉంటే ఉగాది తర్వాత నుంచి పాలనను విశాఖ నుంచే జగన్ ప్రారంభించాలని భావిస్తున్నారు. అలాగే మార్చిలో రెండు అంతర్జాతీయ సదస్సులు జరగనున్నాయి. వీటన్నింటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ తనకు కలిసొచ్చిన శారదాపీఠంకి వెళ్లి వస్తే అంతా శుభం జరుగుతుందన్న భావనలో ఉన్నారట. అందుకే 28 వతేదీన వార్షిక బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నారని తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక మార్పులు
కేసీఆర్ , జగన్ భేటీ అయితే రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇరువురి మధ్య రాజకీయంగా పరస్పర అవగాహన ఉందని ఇప్పటికీ ప్రచారం జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీతో ఏపీలోనూ విస్తరించాలనుకుంటున్నారు. అయితే కాపు సామాజికవర్గం ఓట్లను చీల్చి.. వైసీపీకి మేలు చేయాలని అనుకుంటున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. వీటన్నింటికీ.. ఇద్దరి భేటీ మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది.