ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. తరగతుల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని కాలేజీల యాజమాన్యాలకు సూచించింది. ఈ మేరకు బోర్డు సెక్రటరీ రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు.
10వ తరగతి ఫలితాలు విడుదల..
ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ సైట్‌లో జిల్లా, మండలం, స్కూల్, విద్యార్థి పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. షార్ట్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ప్రధానోపాధ్యాయులకు మాత్రమే ఉంది. వీరి ద్వారా విద్యార్థులు మెమోలను పొందవచ్చు.
ఈసారి 2021తో పాటు 2020లో పదో తరగతి పూర్తయిన వారి ఫలితాలను కూడా విడుదల చేశారు. కోవిడ్ కారణంగా గతేడాది పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. 2020లో మార్కులు కేటాయించకుండా కేవలం ఉత్తీర్ణులైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ విద్యార్థులకు ప్రస్తుతం గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లను అందించారు.
అడ్మిషన్లు స్టార్ట్ చేసిన కాలేజీలపై ఇంటర్ విద్యా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు ఎలా తీసుకుంటారని మండిపడుతున్నారు అధికారులు. అలాంటి కాలేజీలపై చర్యలకు రెడీ అవుతున్నారు.
ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాక ముందే అడ్మిషన్లు చేపట్టిన ప్రైవేటు కాలేజీల గుర్తింపు రద్దు చేయడానికి ఇంటర్ బోర్డు అధికారులు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. చాలా కాలేజీలు ఫీజులు కూడా కలెక్షన్లు చేశాయని... ఇలాంటి వాటిని సహించేది లేదని చెబుతున్నారు అధికారులు. ఇప్పటి ప్రైవేటు కాలేజీలు చేపట్టిన అడ్మిషన్లు చెల్లవంటు ప్రకటించారు.
ఇంటర్ అడ్మిషన్లు అంటూ ఫోన్లు చేసినా... తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చినా చర్యలు తప్పవంటున్నారు. ఇలాంటి వారి వివరాలు విద్యాశాఖాధికారులు చెప్పాలని తల్లిదండ్రులకు, విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచే అడ్మిషన్లు తీసుకోవాలని చెబుతున్నారు. ఆ తర్వాతే ప్రక్రియ చేపట్టాలని కాలేజీలను ఇంటర్ బోర్డు ఆదేశించింది.