వినాయక చవితి వేడుకలు బహిరంగ వేదికలపై నిర్వహించవద్దన్న ఏపీ సర్కార్ ఆంక్షలు విధించింది. అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. వినాయక చవితి వేడుకలు ఇళ్లలోనే నిర్వహించుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితికి విగ్రహాలను ఏర్పాట్లు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సర్కార్ ఆంక్షలపై బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
హిందూ వ్యతిరేక విధానాలు!
వినాయకచవితి వేడుకలు బహిరంగ వేదికలపై నిర్వహించవద్దన్న ప్రభుత్వ నిర్ణయం వెనుక కుట్రకోణం దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించలేదా అని ప్రశ్నించారు. ఒకపక్క కరోనా అదుపులో ఉందని చెబుతూనే చవితి వేడుకలకు వైరస్ అడ్డంకిగా ఉందని రాష్ట్రప్రభుత్వం చెబుతుందని ఆయన సీఎం జగన్ కు శనివారం లేఖ రాశారు. హిందూ వ్యతిరేక విధానాల కొనసాగింపులో భాగంగానే చవితి వేడుకలు రద్దు చేసినట్లు హిందూ సమాజం భావిస్తోందన్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా వేడుకలను నిర్వహిస్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా బహిరంగ వేడుకలకు అనుమతించాలని డిమాండ్ చేశారు.
ఏకపక్ష నిర్ణయం
కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, సినిమాహాళ్లు పనిచేస్తున్నాయని లేఖలో సోము వీర్రాజు గుర్తుచేశారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో అధికారులతో పాటు రాజకీయపక్షాల సలహాలు తీసుకోవాలని సూచించారు. వేడుకలపై ఆంక్షలు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని ఆరోపించారు. ఊరేగింపులు, నిమజ్జనం చేయొద్దంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని నిలిపేయాలని సోము వీర్రాజు పేర్కొన్నారు.
కర్నూలులో ఆంక్షలపై వివాదం
తాజాగా కర్నూలులో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ వివాదం నెలకొంది. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయరాదని, ఉత్సవాలు నిర్వహించరాదని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిలు ఆదేశాలు జారీచేశారు. కరోనా నిబంధనల దృష్ట్యా వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. అధికారుల ఆదేశాలను వినాయక నిమజ్జన ఉత్సవ కమిటీ, బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత కర్నూలులోనే అత్యంత ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పుడు కరోనా పేరుతో ఆంక్షలు విధించడం సరికాదని, ఉత్సవాలకు నిమజ్జన ఊరేగింపులకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. వినాయక ఉత్సవాలపై బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నేతలు శివ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డిలు పాల్గొనున్నారు.