Skill Scam in AP High court: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు మరోసారి ఏపీ హైకోర్టు ముందుకు వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లు  చెబుతున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం తీవ్రత దృష్ట్యా...ఆ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన ప్రజా  ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)పై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ మండవ కిరణ్మయి ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. కేసు దర్యాప్తును  సీబీఐ, ఈడీకి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని తెలిపింది ఏపీ ప్రభుత్వం. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మాత్రమే కాదు...  ఏ దర్యాప్తు సంస్థకు అప్పగించినా  సమత్తమేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. 


మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు...  ఏపీ ప్రభుత్వం అభిప్రాయం కోరింది. కోర్టు ఆదేశాలతో... ఈ  పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా కౌంటర్‌ దాఖలు చేశారు. స్కిల్ స్కాం కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్ధ సీబీఐతో  దర్యాప్తు చేయించేందుకు తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే... స్కిల్‌ స్కామ్‌ కేసులో  చాలా చిక్కులున్నాయని కోర్టుకు తెలియజేసింది. మనీలాండరింగ్‌ కూడా జరిగిందని కోర్టుకు వివరించింది. 


స్కిల్‌ స్కామ్‌తోపాటు సీఆర్‌డీఏ పరిధిలో జరిగిన అసైన్డ్‌ భూముల కుంభకోసం, ఏపీ ఫైబర్‌నెట్‌ కుంభకోణాలపై 2020లోనే సీఐడీ దర్యాప్తు చేపట్టిందని, వీటిపై దర్యాప్తు  చేయాలని సీబీఐని కూడా కోరినట్లు కౌంటర్‌లో తెలిపింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేసేందుకు అంగీకారం కూడా తెలిపామని అన్నారు. అంతేకాదు... దీనికి  సంబంధించిన జీవోలు కూడా జారీ చేశామని చెప్పారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి... హైకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చినా కట్టుబడి ఉంటామని  చెప్పారు అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) శ్రీరామ్‌ తెలిపారు.


మరోవైపు... ఈ కేసులో పిటిషనర్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ కీలక అంశాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో కొందరు ప్రతివాదులను నోటీసులు అందలేదని,  మరికొందరు నోటిసులు తీసుకొనేందుకు ఇష్టపడటం లేదని కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. నోటీసులు ఎవరికి అందాయి, ఎవరికి  అందలేదని ప్రశ్నించింది. దీనికి సమాధానం ఇచ్చారు ఉండవల్లి తరపు న్యాయవాది కేజీ కృష్ణమూర్తి. కొందరికి నోటీసులు అందాయని... కొందరు తిరస్కరించారని కోర్టుకు  తెలిపారు. డోర్‌ లాక్, ఇంట్లో ఎవరూ లేని కారణంగా కొన్ని వెనక్కి వచ్చాయని వివరించారు. నోటీసులు అందని వారికి.. ఇతర మార్గాల్లోనోటీసులు పంపేందుకు  అనుమతివ్వాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. తదుపరి విచారణలో న్యూస్ పేపర్ ద్వారా ప్రతివాదులకు నోటీసులు పంపే అంశంపై నిర్ణయం  తీసుకుంటామని ప్రకటించింది. అలాగే ఉండవల్లి దాఖలు చేసిన ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.