Veterinary Mobile Clinic: మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన వైఎస్సీఆర్ సంచార పశు ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు ఏపీ సీఎం జగన్.. ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే నియోజక వర్గానికి ఒకటి చప్పున రూ.129.07 కోట్లతో 175 వాహనాలను అందుబాటులోకి తీసుకు రాగా.. తాజాగా మరో 165 వాహనాలను వినియోగంలోకి తీసుకువచ్చారు. రెండో విడతలో భాగంగా రూ.111.62 కోట్లతో మొత్తం 165 వాహనాలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. వీటిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద పచ్చ జెండా ఊపి మరీ ఈరోజు ప్రారంభించారు. ఈ అంబులెన్సుల విషయంలో జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, పంజాబ్, మధ్య ప్రదేశ్ తదితర ఏపీని స్ఫూర్తిగా తీసుకొని అడుగులు వేస్తున్నాయి. 






54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు 81 రకాల మందులు


ఈ అంబులెన్స్ ల కోసం జాతీయ స్థాయిలో 1962 కాల్ సెంటర్ తో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీకృత కాల్ సెంట్ 1555251ను అనుసంధానించారు.ఈ నంబర్ల ద్వారా అంబులెన్స్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ అంబులెన్సులో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను అందుబాటులో ఉంచారు. ప్రతి అంబులెన్సులో రూ.35 వేల విలువైన 81 రకాల మందులను కూడా అందుబాటులో ఉంచారు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోల బరువు ఎత్త గలిగే హైడ్రాలిక్ లిఫ్టును ఏర్పాటు చేశారు. నిర్వహణ బాధ్యతలను జీవేకే-ఈఎంఆర్ఐకు అప్పగించారు. 






మూగ, సన్న జీవాలను కాపాడుతున్న అంబులెన్సులు


కాల్ సెంటర్ కు రోజుకు సగటున 1500 చొప్పున.. 8 నెలల్లో 3.75 లక్షల ఫోన్ కాల్స్ రాగా.. ఒక్కో వాహనం రోజుకు సగటున 120 కిలో మీటర్లకు పైగా వెళ్లి వైద్య సేవలు అందిస్తోంది. 2 వేల 250 ఆర్బీకేల పరిధిలో 4 వేల గ్రామాల్లో 1.85 లక్షల జీవాలకు వైద్య సేవలు అందించాయి. 6 వేల 345 వేలకు పైగా మేజర్, 10 వేల 859 మైనర్ శస్త్ర చికిత్సలు చేశారు. అత్యవసర వైద్య సేవల ద్వారా లక్షకు పైగా మూగ, సన్న జీవాల ప్రాణాలను కాపాడగలిగారు. తద్వారా 1.75 లక్షల మంది లబ్ధి పొందారు. మనుషులకే కాకుండా మూగ జీవాల కోసం కూడా ప్రత్యేక అంబులెన్సులు కేటాయించడం రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.