CM Jagan On Teachers Day :  విద్యార్థులను తీర్చిదిద్ది మంచి విద్యాబుద్ధులు నేర్పే శిల్పులు ఉపాధ్యాయులు అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ప్రతిపక్షాలు టీచర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం జగన్ ఆరోపించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. ఇత రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉండేలా విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టామన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన మోనులో మార్పులు చేశామన్నారు.  



పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం 


వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచిందని సీఎం జగన్ తెలిపారు. ఎస్జీటీలను స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోట్‌ చేశామన్నారు. ఉద్యోగుల పింఛన్ల సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానిది కాదన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దే ముఖ్య బాధ్యత ఉపాధ్యాయులదని సీఎం అన్నారు. ఉపాధ్యాయులకు శిఖరం వంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు.  విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేపట్టామన్నారు.  విద్యా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీపడే విధంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పెద్ద చదువులకు పేదరికం అడ్డు రాకూడదని, నాణ్యమైన చదువులు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. 


మంచి చదువులకు పేదరికం అడ్డుకాకూడదు 


"విద్యార్థులు తమపై రుద్దిన చదువును వేరే గత్యంతరం లేక చదువుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ఇవి ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవి కావు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టాలని ఏ నిర్ణయాలు తీసుకోం. ఉపాధ్యాయుల చేతిలో శిల్పాలుగా మారే పిల్లల భవిష్యత్తును మరింత మెరుగ్గా  చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్‌ తరాలకు అవసరమైన చదువుల కోసం ముందడుగులు వేస్తున్నాం. మంచి చదువులకు పేదరికం అడ్డు కాకూడదని, విద్య అందరికీ అందుబాటులో ఉండాలని చర్యలు చేపట్టాం"- సీఎం జగన్ 



ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 


మంచి శిల్పి చేతిలో పడితే రాయి కూడా శిల్పంలా మారుతుందని సీఎం జగన్ అన్నారు. అద్భుతమైన శిల్పాలు చెక్కే శిల్పులు మన ఉపాధ్యాయులని సీఎం అన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఉపాధ్యాయులందరికీ సీఎం జగన్ టీచర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని 176 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 58 మంది ఉపాధ్యాయులు, ఇంటర్‌ విద్య నుంచి 19 మంది, ఉన్నత విద్య నుంచి 60 మంది అధ్యాపకులు, భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఐదుగురు, కేజీబీవీల నుంచి ముగ్గురు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు ఐదుగురికి పురస్కారాలను అందించారు. 


Also Read : Jagananna Smart Township: జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌‌నకు చుక్కెదురు, వాళ్లు ముందుకు రాకపోవడంతో తప్పని చిక్కులు


Also Read : Vijayawada: బెజ‌వాడలో హత్యా రాజకీయాలు! ఆ గొడవ ఉత్తిదే అని కొట్టిపారేసిన పోలీసులు - ఇంకా నోరు విప్పని వైసీపీ